కాంగ్రెస్ పని అయిపోయినట్టే..! ఆజాద్ కామెంట్లతో కలకలం..

“కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తేనే కానీ, ప్రస్తుత బీజేపీ  ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్దరణ సాధ్యంకాదు అది జరిగితేనే కానీ, జమ్ము కశ్మీర్ రాష్ట్రం స్వయంప్రతిపత్తి పునరుద్దరణ జరగదు. అయితే, ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, ఒంటరిగా 300 స్థానాలు గెలిచి, అధికారంలోకి రావడం అయ్యే పని కాదు. కాంగ్రెస్ అంత భారీ మెజారిటీతో గెలవాలని ప్రార్ధన అయితే చేయగలను కానీ, కాంగ్రెస్ గెలుస్తుందని మాత్రం చెప్పలేను కాబట్టి, ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదు”... కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లోని పూంఛ్లో నిర్వహించిన ర్యాలీలో చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒక రకంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన అసమ్మతి బృందం -  జీ 23 – బృందంలో కీలక నేతగా ఉన్న ఆజాద్ ఉద్దేసపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీని, నాయకత్వాన్ని పలచన చేసి విధంగా మాట్లాడారని, కాంగ్రెస్ నేతలు కొందరు ఆక్షేపిస్తున్నారు.  

ఇటీవల జమ్మూ కశ్మీర్’లో పర్యటించిన రాహుల గాంధీ కూడా, జమ్మూ కశ్మీర్’ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ప్రస్తావన  తీసుకురాలేదు. అది అయ్యేపని కాదు కాబట్టే రాహుల్ గాంధీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు.అయితే,ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్’తో ఆందోళన చేస్తున్న, వివిధ సంస్థల నుంచి అదే విధంగా ప్రాతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆర్టికల్ 370 విషయంలో  చేతులు ఎత్తేసిందనే విమర్శలు ఎదుర్కుంటోంది. కాంగ్రెస్ పార్టీకి 370 విషయంలో చిత్తశుద్ది లేదని ఆరోపిస్తున్నాయి. ఈ  నేపధ్యంలోనే గులాం నబీ ఆజాద్’ 370 పునరుద్దరణ అయ్యే పని కాదని వివరణ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ నాయకత్వాన్ని పలచన చేసే ఉద్దేశం ఆయనకు లేదని ఆజాద్ వర్గం ఎదరు దాడి  చేస్తోంది.  రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే ఆజాద్ చెప్పారని అంటున్నారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని ఆజాద్ పేర్కొనడం పార్టీ ఇమేజిని దెబ్బ తీసేవిధంగా ఉందని అంటున్నారు. మరో వంక, కారణాలు ఏవైనా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న  జీ -23 ఈ వివాదంతో మరోమారు తెరమీదకు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.   

కాగా జమ్ము కశ్మీర్ కు  ప్రత్యేక అధికారాలు కల్పించే 370వ అధికరణాన్ని 2019లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్ము కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తగిన సమయంలో కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇటీవల పేర్కొంది.కొద్దిరోజుల క్రితం ఈ అంశంపైనా ఆజాద్ విమర్శలు కురిపించారు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చడం జరుగుతుందని, కానీ మోదీ సర్కారు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతానికి దిగజార్చిందని వ్యాఖ్యానించారు. 

నిజానికి ఆజాద్ ఉద్దేశం ఏమైనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో గత కొంత  కాలంగా నివురుగప్పిన నిప్పులా స్తబ్దుగా ఉన్న అంతర్గత విభేదాలను మళ్ళీ తెర పైకి తెస్తుందని అంటున్నారు.

Related Segment News