ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడి కుమారుడికి భారీ మోసం

 

హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్‌ తేజను అధిక లాభాల ఆశ చూపి హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు నిలువునా ముంచేసి ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించి మొత్తం రూ.63 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు చేస్తూ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమితవ్‌ తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 

గత ఏడాది 2025 ఏప్రిల్‌లో మోతీ నగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌ దంపతులతో అమితవ్‌ తేజకు పరిచయం ఏర్ప డింది. ఆ పరిచయాన్ని అవకాశంగా మలుచుకున్న దంపతులు ట్రేడింగ్‌లో పెట్టు బడి పెడితే భారీ లాభాలు వస్తాయని, ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్‌ను అప్పగిస్తా మని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నిజమని నమ్మిన అమితవ్‌ తేజ తొలుత కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టారు. వారం రోజులకే రూ.9 లక్షలు లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలు, స్టేట్‌ మెంట్లు చూపించి అమితవ్‌ తేజ నమ్మించారు. 

వాటిని చూసి నిజమని భావించిన అమితవ్‌ తేజ క్రమంగా విడతల వారీగా మరిన్ని పెట్టుబడులు పెట్టాడు.ఇలా మొత్తం రూ.63 లక్షలు దంపతులకు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి లాభాలు రావడంతో పాటు పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.. దంపతులను ప్రశ్నించగా మాట తప్పించ డంతో మోసపోయినట్టు గ్రహించిన అమితవ్‌ తేజ చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్ పేరుతో నకిలీ పత్రాలు చూపించి డబ్బులు కాజేసిన ఘటనపై సైబర్ కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఉపయోగించిన ఖాతాలు, ఇతర బాధితులు ఉన్నారా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం...ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఆఫర్లు వస్తే ముందుగా పూర్తిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu