మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే మూడు విషయాలు!

మనిషి జీవితంలో బలాలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే...

బలాలు

మనిషి జీవితంలో బలాలు మాత్రమే కాదు. బలహీనతలు కూడా ఉంటాయి. అయితే నేటి కాలంలో మనుషులు తమలో ఉన్న బలాలను పక్కన పెట్టి తమలో ఉన్న చిన్న బలహీనతల్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఫలితంగా తమలో చాలా పెద్ద లోటుపాట్లు ఉన్నాయని అవి తమ జీవితాన్నే కుదిపేస్తున్నాయనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కలిసినప్పుడు తమ గురించి తాము ఓపెన్ గా మాట్లాడుకోగలిగే చనువు ఉంటే గనుక అలాంటి సందర్భంలో  సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అంటూంటారు. కానీ అందరూ గ్రహించని ముఖ్య విషయం ఏమిటంటే… అందులో అధికశాతం ఊహించుకున్నవే. 

ఇక్కడ బలహీనతలంటే మొహమాటం, ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన.. లాంటి వైఖరులన్నమాట. ఉదాహరణకి చెప్పుకుంటే తను చదివే కోర్సు పూర్తయిపోగానే తరువాత ఏది ఎంపిక చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొందరు చాలా బాధపడిపోతారు. అలాంటి పరిస్థితిలో వారి మనసులో ఉండే భావం ఎలాంటిదంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోందే అనే బాధ, నాకు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి నాకు తెలియనప్పుడు అనే సంఘర్షణ ఒక విద్యార్థిలో ఏర్పడటం తన బలహీనతగా భావిస్తాడు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే, తెలుసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి.

మనిషిలో ఉండే బలహీనతలు ఎప్పటికీ బలహీనతలుగా ఉండిపోవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ బలహీనతలు క్రమంగా అధిగమించవచ్చు.

అవకాశాలు

అవకాశాల గురించి చాలామందికి అవగాహన సరిగా ఉండదు. తమ ముందున్నవి అవకాశాలే కాదు అన్నంత నిర్లక్ష్యంగా, అవగాహనా లోపంతో ఉంటారు చాలామంది.  చదువుకునే విద్యార్థుల నుంచి, ఉద్యోగాలు చేసే వారి వరకు తాము ముందుకు పోవడానికి గల అవకాశాలను గుర్తించడం అరుదు. చదువుకునే విద్యార్ధినీ విద్యార్థులు, తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏమి సాధించగలరో, తమ కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఎలా పెంచగలరో గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు. ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు... ఇలా తమ జీవితానికి ఉన్న మార్గాలను అనుసరించి ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియకకాదు. అన్నీ తెలుసు. కానీ బద్ధకం, నిర్లక్ష్యవైఖరి, చెడు అలవాట్లు అడ్డుపడుతున్నాయి. 

భయాలు 

మనిషి పతనానికి మూలకారణం భయం. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే చిన్న భయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయమార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప, గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. “నేను మాట్లాడలేను, నావల్లకాదు" వంటి మాటలకు ముగింపు చెప్పాలి.మాట్లాడటం అందరికీ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేను?? విషయం గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ అవగాహన ఉన్న విషయాన్ని మాట్లాడటమే క్షదా చేయాల్సింది. అలాంటప్పుడు మాట్లాడలేమనే భయం ఎందుకు?? ఇలాంటి ప్రశ్నను తమకు తాము వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒకానొక ప్రేరణ ఎవరిలో వారికి కలుగుతుంది. 

కాబట్టి మనిషి జీవితంలో బలహీనతలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన విధంగా డీల్ చేయడం నేర్చుకోవాలి.

                               ◆నిశ్శబ్ద.