ఈ ఏటి ఉత్తమ ఫొటో ఇదే... ఎందుకంటే!
posted on Feb 19, 2016 11:28AM
.jpg)
వెన్నెల రాత్రిని చూసి కవులు ఎన్నో ప్రేమకవితలను రాయవచ్చుగాక! కానీ వారు భావోద్వేగంతో కవితలు రాసే సమయంలో ఎన్నో జీవితాలు తారుమారైపోతుంటాయి. వేలాది బతుకులు ఛిద్రమైపోతుంటాయి. అక్కడక్కడా చిన్నిచిన్న ఆశలు మాత్రమే మిగిలి రగులుతుంటాయి. అలాంటి ఓ బతుకు చిత్రం ఒకటి ఈ ఏటి ఉత్తమ ఫొటోగా నిలిచింది. హంగేరీ-సెర్బియాల మధ్య ఉన్న కంచె వద్ద తీసిన ఈ ఫొటోతో ముడిపడిన భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి. యురోపియన్ యూనియన్‌లో భాగస్వామిగా ఉన్న హంగెరీలోకి ప్రవేశించేందుకు సెర్బియా తరఫు నుంచి లక్షలాది శరణార్ధులు సదా సిద్ధంగా ఉంటారు. ఒక్కసారి వారు కనుక హంగెరీలోకి ప్రవేశించగలిగితే దాంతోపాటు, యూరోపియన్ యూనియన్లో ఉండే 28 దేశాలలో ఎక్కడైనా తలదాచుకోవచ్చన్నది వారి ఆశ.
అలా ఆశగా ప్రవేశించేవారిని నిలువరించేందుకు హంగెరీ సరిహద్దు పొడవునా కంచెని నిర్మించింది. ఈ కంచె ఎంత పదునుగా ఉంటుందంటే... దాన్ని పట్టుకుంటే వేలు తెగిపోవాల్సిందే! అలాంటి చోట ఒక పిల్లవాడిని సెర్బియా వైపు నుంచి హంగెరీలోకి అందించడమే ఈ ఫొటోలో గమనించవచ్చు. మరి ఆ పిల్లవాడు ఎవరు? అతని భవిష్యత్తు ఏమిటి? అతడితో పాటు వచ్చిన వ్యక్తి సరిహద్దు దాటగలిగాడా? అన్న ప్రశ్నలకి ఫొటోగ్రాఫర్ రిచర్డసన్ వద్ద స్పష్టమైన జవాబులు లేవు. అలాంటి జవాబు తెలియకపోవడమే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందేమో!