భోజనం అడిగితే... కొట్టి చంపేశారు!

 

రోజూ ఆ పాప బుద్ధిగా బడికి వెళ్తుంది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం కింద కాస్త కడుపు నింపుకుంటుంది. ఆ రోజు ఆకలేసిందో ఏమో.. మరో రెండు ముద్దలు పెట్టమని వంటవారిని అడిగింది. అంతే గరిటెతో ఒక్కటిచ్చి తరిమేశారు. ‘భోజనం ప్రతి పిల్లవాడి హక్కూ, అంతమాత్రానికే పాపని కొట్టి తరిమేస్తారా?’ అంటూ పాప తండ్రి షాగిర్‌ పాఠశాలకి వచ్చాడు. షాగిర్‌ మాటలకి పాఠశాల ఉపాధ్యాయులకు అహం దెబ్బతిన్నది. అక్కడాఇక్కడా అని చూడకుండా విచక్షణారహితంగా అతణ్ని కొట్టారు. ఆ దెబ్బలకి తాళలేక షాగిర్‌ చనిపోయాడు! ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, భోజనం గురించి ప్రశ్నిస్తే చావబాదడం ఆ ఉపాధ్యాయులకు కొత్తకాదనీ చెబుతున్నారు గ్రామస్తులు. బీహార్‌లోని గోక్లాపూర్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడి పాఠశాలలు ఎంత అధ్వాన్నంగా నడుస్తున్నాయో చెప్పకనే చెబుతోంది.

 

 

కానీ ఉపాధ్యాయ సంఘాల వాదన మాత్రం వేరేగా ఉంది. ప్రభుత్వం తన ఆర్భాటం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందే కానీ అందుకోసం తగిన నిధులను ఇవ్వదనీ, అందుకే ప్రతి అన్నంమెతుకునీ కొలుచుకోవలసి వస్తోందని చెబుతున్నారు. నిధుల లేమి వల్ల ఆకలి తీరేంత భోజనాన్ని అందించలేకపోతున్నామనీ, ఒకోసారి నాణ్యతలో కూడా తీవ్రమైన లోపాలు తలెత్తుతున్నాయనీ ఆరోపిస్తున్నారు. ఇలా ఖర్చు తగ్గించుకునేందుకు ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని వండటంతో పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా బీహార్‌లో ఉన్నాయి. 2013లో బీహార్లోని ఛాప్రాలో ఇలా 23 మంది పిల్లలు విషాహారాన్ని తిని చనిపోయారు. ఈ ఘటన జరిగి ఇంకా మూడేళ్లు గడిచినా కూడా ప్రభుత్వం ఇంకా మేల్కొన్నట్లు లేదు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu