జీవితాన్ని అప్డేట్ చెయ్యండి

కాల గమనంలో జీవిత చిత్రం మునపటిలా లేదు. చాలా మార్పు వచ్చింది. ప్రపంచం ఇపుడు స్మార్ట్ ఫోన్ రూపంలో మన చేతిలోకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ మనిషికి శరీరంలో భాగం అయిందంటే అతిశయోక్తి కాదు.

ఈమధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ వ్యాపకంలో పడి ఆటో లో బాబుని మర్చిపోయు వెళ్తుంది. అది గమనించిన ఆటో డ్రైవర్ ఆ పాపని ఎత్తుకొని వెళ్లి ఫోన్ ప్రపంచంలో ఉన్న తల్లికి ఇస్తాడు. ఇదీ పరిస్థితి 

పత్రికల్ని చదవడానికి ఆన్లైన్ న్యూస్, బ్రష్ పేస్ట్ నుంచి కూరల్లో కరివేపాకు వరకు ఆన్లైన్ ఆర్డర్స్, స్నాక్స్ కావాలంటే స్విగ్గీ జామాటో లో నచ్చినవి ఇంటికి తెచ్చిపెట్టే సంస్థలు. వీటన్నింటికీ ఆవాసం స్మార్ట్ ఫోన్. అందుకే ఇది లేకుండా ప్రస్తుత జీవన విధానాన్ని ఊహించలేము. ఇంట్లో కూర్చున్న కుర్చీలోంచి లేవకుండా కావాల్సిన అవసరాలు తీరిపోతాయి.  అయితే వీటి కారణంగా మనిషి తెలియని ఒత్తిడికి లోనవుతున్నాడు. ఆర్డర్ చేసినవి సక్రమంగా వచ్చాయో లేదో! లేకుంటే తిరిగి ఆర్డర్ చేయడం, చేసినదానికోసం పడిగాపులు కాయడం, ఒక సైజ్ ఆర్డర్ చేస్తే ఇంకో సైజ్ రావడం ఇలాంటివన్నీ మనిషి కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తాయి. అంతేకాదు  అంతర్లీనంగా బద్దకాన్ని  కూడా అలవాటు చేస్తుంది.

ఈ కొత్త లైఫ్ స్టైల్ లో కొన్ని అవసరం లేని సౌకర్యాలను కత్తిరించుకొని బద్దకానికి ఆలవాలం అయిన వాటిని ట్రిమ్ చేస్తే జీవితం స్మాట్ గా ఉంటుంది. పొద్దున్నే పేపర్ కొని చదవండి. ఇంట్లోకి కనీస అవసరాలు అయిన వంట సామాను, కూరగాయలు, పేస్ట్, బ్రష్ షాప్ కి వెళ్లి స్వయంగా కొని తెచ్చుకోండి. బయట ప్రపంచం స్థితిగతులు,మార్కెట్ హెచ్చుతగ్గులు తెలుస్తాయి. వాస్తవిక ప్రపంచానికి దూరం కాకుండా ఉంటారు.

అప్డేట్ అంటే అర్థం ఉన్న స్థితి కంటే ఇంకా సౌకర్యం అయిన స్థితికి రూపాంతరం చెందటం. కానీ ఇక్కడ మనం అచేతనమైన స్థితికి దిగజారుతున్నాము. అందుకే అవసరం లేని సౌకర్యాలను తీసేసి ఆరోగ్యకరమైన జీవితంగా అప్డేట్ చేసుకోండి. అప్పుడే సమాజం చేతనవంతమై ప్రకాశిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ