అతను ఇంటర్నెట్ని ముందుగానే ఊహించాడు

‘మార్షల్ మెక్లుహాన్’ – ఈ పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదాన్ని వినే ఉంటారు కదా! ఆ మాటని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తే మార్షల్ మెక్లుహాన్. అంతేకాదు... సాంకేతికతకు, మీడియాకు సంబంధించి ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి.

సరిగ్గా 106 ఏళ్ల క్రితం మార్షల్ కెనడాలో పుట్టాడు. మంచి చదువు చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. అప్పుడే ప్రజలు నిదానంగా టీవీకి అలవాటుపడుతున్నారు. అదో అద్భుతం అనుకుని మురిసిపోతున్నారు. మీడియా అన్న పదం అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆ సమయంలో మార్షల్ మీడియా గురించి ప్రత్యేకించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిలో అనేక సిద్ధాంతాలు చేశాడు.

మార్షల్ 1962లో The Gutenberg Galaxy అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన మానవచరిత్రను నాలుగురకాలుగా విభజించాడు.

* మొదటి దశ acoustic age- ఈ దశలో కేవలం వినికిడి ద్వారానే సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది.

* రెండో దశ literary age – ఈ దశలో నిదానంగా రాయడం అలవాటు అవుతుంది. ఆకుల మీదో, కాగితాల మీదో సమాచారాన్ని రాసుకుంటారు.

* మూడో దశ print age – ఈ దశలో పుస్తకాలను ముద్రించడం సులువుగా మారిపోతుంది. కావల్సినంత సమాచారం పుస్తకాల రూపంలో దొరుకుతుంది.

* నాలుగో దశ electronic age – ఈ దశంలో సమాచారం అంతా కూడా టీవీ, కంప్యూటర్ వంటి పరికరాల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి చేరతాయి.

మానవుడు మొదటి మూడు దశలనీ దాటేసి నాలుగో దశలోకి చేరిపోయాడనీ, ఇక మున్ముందు అంతా సమాచార విప్లవమే అని తేల్చి చెప్పేశాడు మార్షల్. అంతేకాదు! కంప్యూట్ అనే పరికరం కేవలం లెక్కలు చేయడానికే కాదునీ... పరిశోధనలు చేయడానికీ, ఒకరొకొకరు సమాచారం అందించుకోవడానికి సాయపడుతుందనీ ఊహించాడు. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్లకి కానీ జనాలకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. దీన్ని బట్టి మార్షల్ ఊహ ఎంత ఖచ్చితమైనదో తెలిసిపోతుంది.

మీడియాదే రాజ్యమనీ మున్ముందు ప్రతి విషయాన్నీ మీడియా తనదైన దృష్టిలో ప్రజలకు చేరవేస్తుందనీ ఆనాడే పసిగట్టారు మార్షల్. అందుకే ‘the medium is the message’ అన్న మాటని ఉపయోగించారు. ‘మీడియా ఎంత చెబితే అంత’ అన్న భావం ఇందులో స్ఫురిస్తుంది. మార్షల్ బతికున్నంతకాలమూ ఆయన మాటల్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. తరచూ టీవీలూ, మేధావులూ ఆయనను తల్చుకున్నా... ఆయన మాటలు నిజమవుతాయని ఎవరూ భావించలేదు. కానీ 1980లో మార్షల్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగినదంతా మనకి తెలిసిన చరిత్రే!

ఏదన్నా పరిణామం జరిగిన తర్వాత దాని గురించి విశ్లేషించడం, అందులో మనం కూడా పాలుపంచుకోవాలని కోవడం సహజమే! కానీ భవిష్యత్తులో ఇలా జరగబోతోంది అని ముందుగానే ఊహించడం గొప్ప లక్షణం. అందుకే ఇవాళ గూగుల్ సైతం మార్షల్ని గౌరవించుకోవాలని అనుకుంది. ఆయన పేరుతో ఒక డూడుల్ని రూపొందించింది.

- నిర్జర.