హైదరాబాద్ పై మళ్లీ ఉగ్ర పడగ?.. దాడుల కుట్ర భగ్నంతో ఉలిక్కిపడిన విశ్వనగరం

ప్ర‌జ‌లలో మ‌ళ్లీ ఉగ్ర‌ దాడులు భయం పెచ్చరిల్లింది. సమాజంలో ద్వేష భావం పెరగడం, మత ఉద్రిక్తతలు నెలకొనడానికి తోడు ఆదివారం( అక్టోబర్ 2) హైద‌రాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్రను భగ్నం చేస్తూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఆ భ‌యం, ఆ ఆందోళన రెండింత‌ల‌యింది.  ప్ర‌ధానంగా వారు ఆర్ ఎస్ ఎస్‌, బీజేపీ నాయ‌కుల‌పై  ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న సమాచారం ఆ భయాందోళనను మరింత పెంచింది.  ఏమ‌యిన‌ప్ప‌టికీ హైదరాబాదీయులు మ‌రో మారు మత ఘర్షణలను సహించేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. చాలాకాలం క్రితం కోటీలోని గోకుల్ చాట్ భండార్, లుంబినీ పార్కులలో జరిగిన జంట పేలుళ్లు, దిల్‌సుఖ్ న‌గ‌ర్ ల‌లో జ‌రిగిన   పేలుడు ఘటనల గాయాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  దసరా పండుగ సమయంలో మరో ఉగ్రదాడికి కుట్రను పోలీసులు భగ్నం చేశారన్న వార్త వారిని మరో సారి భయాందోళనలకు గురి చేసింది. కుట్ర భగ్నమైంది కనుక సరిపోయింది.. లేకుంటే అన్న ఊహా హైదరాబాదీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.  తాజాగా ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. 

 కేంద్రం ఇటీవ‌ల దేశవ్యాప్తంగా  పిఎఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల‌పై ఎన్ ఐ ఏ దాడులు దూకుడుగా చేప‌ట్టిన నేపథ్యమే.. హైద‌రాబాద్‌పై ఉగ్రవాదుల కన్నుపడటానికి కారణంగా భావిస్తున్నారు.   దీనికి తోడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవ‌ల ఢిల్లీలోని మ‌ద‌ర‌సా లో ముస్లిం నేత‌తో స‌మావేశం కావ‌డాన్ని, భగవత్ ను కొందరు ముస్లిం మత పెద్దలు ప్రస్తుతించడాన్ని కూడా తీవ్ర‌వాద   సంస్థ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాయనీ, ఆ పర్యవశానమే ఉగ్ర దాడులకు కుట్రలని అంటున్నారు. 

బీజేపీ పాల‌నా ప‌రమైన నిర్ణ‌యాలు, దేశంలో ముస్లింల అణ‌చివేత‌కు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా బీజేపీ వ‌ర్గాలు  మాట‌లలు కూడా ఆ సంస్థ‌ల‌ను రెచ్చ‌గొడుతోంద‌న్న అభిప్రాయాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. తెలంగాణాలో అధికారంలోకి రావాల‌న్న ల‌క్ష్యంతోనే  మైనారిటీలపైనా, మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాదీయుల‌మీద కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, నిఘా పేరుతో మైనారిటీలను వేధిస్తున్నారంటూ ఎంఐ ఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని విమర్శించిన నేపథ్యం కూడా ఇదే.

 కాగా పోలీసులు తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో జాహిద్ అనే వ్యక్తి 2005న హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బాంబు పేలుడు కేసులో నిందితునిగా ఉన్నాడు. దానికి సంబంధించి కేసును 2017లో కొట్టివేశారు. అయితే కొంతకాలంగా ఉగ్రకార్యకలాపాలకు దూరంగా ఉన్న జాహిద్ తాజా కుట్ర కోణంలో భాగమయ్యాడని పోలీసులు పేర్కొన్నారు.

కాగా గతంలో మక్కా మసీద్ పేలుళ్ల ఘటనలో కూడా జాహిద్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం జాహిద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధీ నంలో ఉన్నాడు. రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా గ్రనేడ్‌  దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి.. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు.  ఈ సందర్బంగా పాకిస్థాన్ మేడ్ గ్రనేడ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణుష్య ప్రాంతంలో గ్రనేడ్ ట్రయల్ బ్లాస్ట్ ప్రయత్నాలలో ఉండగా  పోలీసులు అరెస్ట్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu