గులాబీబాస్ గుండెల్లో గజ్వేల్ ముళ్లు.. ప్లీనరీకి ప్రిపేర్ అవుతున్నారా?

నిర్మల్’లో బీజేపీ, గజ్వేల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ స్థాయిలో ఎగిసి పడుతున్నాయో చెప్పకనే చెప్పాయి. మరోవంక బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు పాదయాత్రలు, సభలు సమావేశాలు, ప్రజాందోళనలతో జనంలోకి దూసుకుపోతున్నాయి. ఓ వంక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగిస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలతో దాదా పుట్టిస్తున్నారు. అంతే కాదు దండోరా సభలు సక్సెస్ అయిన స్పూర్తితో, అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ యుద్దభేరి మొగించేందుకు సిద్దమయ్యారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక విషయం అయితే, చెప్పనే అక్కరలేదు. కేసీఆర్ దళిత బంధన్నా హరీశ్ రావు ఇంకొకటి అన్నా ఫలితం లేదని తేలిపోయింది. 

ఒక్క మాటలో చెప్పాలంటే, హుజూరాబాద్, ఈటల ఎపిసోడ్’తో తెరాస తెలంగాణ ప్రజల సొంత పార్టీ , ఇంటి పార్టీ స్టేటస్ కోల్పోయింది. ఇంతవరకు సెంటిమెంట్’గా నెత్తికిఎత్తుకున్న పార్టీని, ఇప్పుడు జనం కుతుబామ పార్టీగా మాత్రమే చూస్తున్నారు.  ఒక్క హుజూరాబాద్’లో మాత్రమే కాదు, హుజూరాబాద్‌ ఎఫెక్ట్’తో తెలంగాణ అంతటా కూడా తెరాసతో తెలంగాణ ప్రజలకు ఉన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్, భావోద్రేక బంధం తెగిపోయింది. అందుకే, ఒకప్పుడు తెరాసని నెత్తికి ఎత్తుకున్నజనాలే ఇప్పుడు కుటుంబ పార్టీగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ ప్రయోజనాలకే కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకు మరింతగా బలపడుతోంది. 

ఏ నేపధ్యంలో అధికార తెరాస, కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పార్టీకి దూరమైన తెలంగాణ ప్రజలను మళ్ళీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు ఇంతలా భయపడలేదు. హుజూరాబాద్ ఓటమి ఖరారైన తర్వాతనే ఆయనలో కదలిక వచ్చింది. అంతవరకూ విపక్ష్లాల విమర్శలను సైతం లైట్’గా తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు విపక్షాల విమర్శలకు  భయపడడమే కాదు స్పదిస్తున్నారు. రేషన్ కార్డుల ఇష్యూ మొదలు సీఎంఓ లో దళిత అధికారి నియామకం వరకు ఈటల లేనేట్టిన లోపాలకు కేసీఆర్  ఎలా స్పందించారో చూశాం. అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో  రేవంత్ రెడ్డి చేసిన గర్జన గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగేట్టిస్తోంది. వెన్నులో చలి పుట్టిస్తోంది. అందులే ఆయన అల్లర్ట్ అయ్యారు. దానికి కౌంటర్‌గా వచ్చే నెలలో గజ్వేల్‌లో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 

నిజానికి, గతంలో ఎప్పుడోనే నిర్వహించవలసిన తెరాస ప్లీనరీని అప్పట్లో కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్లీనరీ పేరిట సొంత గడ్డ గజ్వేల్’లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని, తద్వారా సక్సెస్, గ్రాంట్ సక్సెస్ అయిన నిర్మల్, గజ్వేల్ సభలకు సమాధానం చెప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కూడా చాలా వరకు కంట్రోల్’లో ఉన్న నేపధ్యంలో పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించడం ద్వారా విపక్షాలకు జవాబు ఇవ్వడమే కాకుండా, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని నింప వచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ప్లీనరీ  ఎప్పుడు ఉంటుంది అనేదానిలో ఇంకా కొంత స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. అలాగే, ప్లీనరీ ఇప్పుడు అవసరమా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నల్టు తెలుస్తోంది.ఈ సమయంలో ప్లీనరీ నిర్వహించడం కొరివితో తల్గోక్కోవడం అవుతుందా అన్న కోణంలోనూ పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం.  ప్లీనరీ నిర్వహించడమా మరొకటా అనేది ఎలా ఉన్నా, ప్రస్తుతం జనంలో, చివరకు పార్టీ నయలులు, క్యాడర్ ‘లో సైతం ఏర్పడిన,’ ‘కుటుంబ పార్టీ. ‘తెరాస పని పోయింది’ అన్న భావన (పర్సెప్షన్) నుంచి బయట పాడేందుకు కేసీఆర్ ... అంతర్గత మథనం సాగిస్తున్నది మాత్రం నిజం.