లై డిటెక్ట‌ర్‌లు, ప‌రువున‌ష్టం కేసులు.. కేటీఆర్ రేవంత్‌ల మ‌ధ్య ర‌చ్చ రంభోలా..

డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌తో స్టార్ట్ అయింది. స‌వాల్, ప్ర‌తిస‌వాళ్ల‌కు దారి తీసింది. మీడియా ఆజ్యం పోయ‌కున్నా అగ్గి రాజుకుంది. ట్విట్ట‌ర్‌లో వార్ ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డ్ర‌గ్స్‌పై దాడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎదురుదాడి జ‌రుపుతున్నారు. రెండు రోజులుగా రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్ కేటీఆర్ ర‌చ్చ ఓ రేంజ్‌లో సాగుతోంది. అది మ‌రింత ముదిరి లైడిటెక్ట‌ర్ టెస్టులు, కోర్టు కేసుల వ‌ర‌కూ దారి తీయ‌డంతో తెలంగాణలో పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేరింది.

డ్ర‌గ్స్ వాడేవారికి మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ గ‌జ్వేల్ స‌భ‌లో కాక రేపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రేవంత్ కామెంట్స్‌కు కౌంట‌ర్ ఇస్తూ.. డ్ర‌గ్స్‌తో త‌న‌కేం సంబంధ‌మ‌ని.. బ్ల‌డ్‌, లివ‌ర్ శాంపిల్ ఇస్తా.. ఏ టెస్టుకైనా రెడీ.. అయితే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ టెస్టులు రెడీనా అంటూ స‌వాల్ చేశారు మంత్రి కేటీఆర్‌. ఆయ‌న‌కు కౌంట‌ర్‌గా రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. తాను సైతం శాంపిల్స్ ఇస్తాన‌ని.. మీరు కూడా ఇవ్వాలంటూ కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలకు వైట్ ఛాలెంజ్ విసిరడం క‌ల‌క‌లం రేపింది.

తాజాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై మంత్రి కేటీ రామారావు స్పందించారు. ‘‘ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ సిద్ధమేనా? రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో సవాల్‌ విసిరారు. 

కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్‌ రెడ్డి సైతం స్పందిస్తూ మ‌రో ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు. సమయం, స్థలం చెప్పాలన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్‌ అక్రమాలపై పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్ మరింత ర‌చ్చ రాజేశారు.

ర‌చ్చ బాగా ముద‌ర‌డంతో కేటీఆర్ రూట్ మార్చిన‌ట్టున్నారు. ‘‘ఉద్దేశ‌పూర్వ‌కంగా నాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. న్యాయ‌స్థానంలో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశాను. వారిపై కోర్టు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.