సుప్రీంలో జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. హైకోర్టు తీర్పుపై స్టేకు నో

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం ప్రస్తుత ఏపీ శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.  విచారణ జులై 11కి వాయిదా పడింది. హై కోర్టు తీర్పు  కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధానులపై నిర్ణయం తీసుకోలేకుండా చేతులు కట్టేసినట్లయిందని, స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు  ధర్మాసనం తోసిపుచ్చింది.

 అంతకు ముందు ధర్మాసనం ఇతర కేసులపై విచారణ జరుపుతున్న సమయంలో  ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డితో కలిసి మరో సీనియర్‌ న్యాయవాది  ధర్మాసనం ముందుకొచ్చి అమరావతి కేసు గురించి ప్రస్తావించారు. తాము ఇతర కేసులను వింటున్నామని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే తాము అమరావతి కేసుకు తదుపరి విచారణ తేదీని కోరుతున్నామని  విన్నవించారు. దానిపై జస్టిస్‌ జోసెఫ్‌   అసహనం వ్యక్తంచేశారు.  కాగా సుప్రీం కోర్టు  అమరావతి కేసుల విచారణను జూలై 11కి వాయిదా వేయడంతో జగన్ అమరావతి నుంచి విశాఖకు తరలివెళ్లాలన్న ప్రణాళికలకు అడ్డుకట్ట పడినట్లైంది.

ఈ కేసు విచారణ తొందరగా పూర్తై తమకు అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. సాథ్యమైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని, లేదా కనీసం హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని జగన్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. హై కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత తాపీగా ఆరు నెలల తరువాత గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీం ను ఆశ్రయించింది.  అయితే జగన్ సర్కార్ కోరుకున్న విధంగా సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, తొందరగా విచారించాలంటూ.. ఏపీ సర్కార్ తరఫు న్యాయవాదులు పదే పదే కోరడంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో అనేక  అంశాలు ఉన్నాయి కాబట్టి విచారణకు సమయం పడుతుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై గతంలో ఇచ్చిన పాక్షిక స్టే వినా ప్రభుత్వం కోరిన విధంగా స్టే ఇవ్వడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తే.. వెంటనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలన్న తొందరలో వైసీపీ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆ తరువాత సుప్రీంలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చినా ఫరవాలేదన్న భావనలో జగన్ సర్కార్ ఉందని అంటున్నారు. అందుకే సుప్రీం ముందు చూపుతో స్టేకు నిరాకరించిందని అంటున్నారు.  ఇక పోతే అమరావతి రైతుల తరఫున అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో ఉన్నాయి. అలాగే అమరావతి రాజధాని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారు. వారి తరఫున వారి ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు  సుప్రీం అంగీకరించింది.