తెలంగాణలో బోర్లు భోరుమంటాయి...

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రభుత్వం విలవిలలాడుతుంటే, కరెంటు కోతల కారణంగా తమ పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎండాకాలం రాకముందే పరిస్థితి ఇలా వుంది.. ఎండాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా వుంటుందోనన్న ఆందోళన తెలంగాణ రాష్ట్రంలోని అందర్లోనూ వుంది. ఇదిలా వుంటే తెలంగాణ రైతులకు షాక్‌లాంటి మరో విషయం బయటపడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న బోర్లు త్వరలో ఎండిపోబోతున్నాయని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. అసలే కరెంటు లేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి ఇప్పుడు బోర్లు కూడా ఎండిపోతే ఏమైపోతుందో ఊహించడానికే భయం వేస్తోంది. తెలంగాణలో వ్యవసాయం 80 శాతానికి పైగా బోర్లమీదే ఆధారపడి వుంది. దాదాపు 18 లక్షల బోర్లు తెలంగాణలో వున్నాయి. ఇప్పుడు భూగర్భ జల నిపుణులు ఈ బోర్లు భోరుమనబోతున్నాయని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారోనన్న ఆందోళన కలుగుతోంది.