చండీయాగం ముగిసేలోపు వర్షం ఖాయం...
posted on Dec 24, 2015 10:26AM

తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి పతాక స్థాయికి చేరుకుంది. గత మూడేళ్ళ నుంచి వర్షాలు తక్కువగానే వున్నాయి. ఈ ఏడాది అయితే వర్షాకాలం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో రైతులు భారీగా నష్టపోయారు. మామూలుగా అయితే ఈ సమయానికి మరో పంట వేసేవారే. అయితే వర్షాలు లేకపోవటం, భవిష్యత్తులో వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో రైతులు మరో పంట వేసే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అయుత మహా చండీయాగం వర్షాలు కురిపించే అవకాశం వుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. చండీయాగం ముగిసేలోపు వర్షాలు పడటం ఖాయమని వారు అంటున్నారు. యజ్ఞ యాగాల వల్ల వర్షాలు కురుస్తాయి. మన వేదాలు చెప్పే విషయం ఇదే. బుధవారం నాడు చండీయాగం ప్రారంభమైంది. అదేంటోగానీ బుధవారం నాడు తెలంగాణ అంతటా మబ్బులు కమ్ముకున్నాయి. ఆ తర్వాత తేలిపోయాయి. ఈ మబ్బులు కమ్ముకున్నది చండీయాగం కారణంగానే అనే విషయాన్ని హేతువాదులు నమ్మకపోవచ్చుగానీ, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇంతకాలం నుంచి లేని మబ్బులు బుధవారం నాడే పట్టాయంటే దానికి కారణం కేసీఆర్ చేస్తున్న చండీయాగమేనని అంటున్నారు. చూస్తూ వుండండి.... చండీయాగం ముగిసేలోపు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం ఖాయమని వారు అంటున్నారు. చండీయాగం కారణంగానో, ప్రకృతి కరుణించడం వల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండ్రోజుల పాటు అయినా వర్షాలు పడితే తెలంగాణలో రైతులు పంటలు వేసుకోవడంతోపాటు చెరువులు, కుంటలు నిండుతాయి. భూగర్భ జలాలు సమకూరుతాయి. వచ్చే వేసవిలో నీటికి కటకటలాడకుండా వుండే అవకాశం వుంటుంది. అంచేత దేవుడా... కారణం ఏదైనా కావచ్చు... వర్షాలు మాత్రం కురిపించు అని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నారు.