తప్పుకోమని ప్రధాని మోడీయే చెప్పారు కదా?
posted on Dec 24, 2015 8:21AM
.jpg)
డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతుంటే, ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడి లోక్ సభలో మాట్లాడిన మాటలు ఆయనని ఇంకా ఇబ్బందుల్లో పడేశాయి.
“ఇదివరకు లాల్ కృష్ణ అద్వానీపై హవాలా కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఆయన ఏవిధంగా ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకొన్నారో, అదేవిధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడతారు,” అని ప్రధాని మోడీ అన్నారు. హవాలా కేసులో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ తన పదవికి రాజీనామా చేసి, కోర్టులో కేసును ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొన్నారు. కనుక ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన ఈ మాట అరుణ్ జైట్లీని సమర్దిస్తునట్లుగా కాక ఆయనను కూడా రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని సూచిస్తున్నట్లుగా ఉంది. ఇటువంటి సమయంలో మోడీ పొరపాటున అరుణ్ జైట్లీ కేసుని అద్వానీ కేసుతో పోల్చి మాట్లాడారని అనుకోలేము. కనుక ఆయన జైట్లీకి చెప్పదలచుకొన్నది చాలా స్పష్టంగానే చెప్పారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ప్రధాని మోడీ సూచిస్తున్నట్లుగా అరుణ్ జైట్లీ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సిపిఐ (ఎం) జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి కూడా అరుణ్ జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. “ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా సూచించిన తరువాత కూడా ఇంకా పదవిలో కొనసాగడం సరికాదు. ఆయన తను నిర్దోషినని భావిస్తున్నట్లయితే, దైర్యంగా తనపదవికి రాజీనామా చేసి కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే అద్వానీ కేసును వాదించింది అరుణ్ జైట్లీయే. ఇప్పుడు ఆయననే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోంది.