తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా?
posted on May 11, 2021 3:02PM
తెలంగాణ శాసనమండలిలో ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3న, గవర్నర్‌కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ముగుస్తోంది. పదవీకాలం పూర్తయ్యేవారంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే.
ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై అధికార పార్టీ కసరత్తు కూడా చేస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే జూన్ 3తో ఆరు స్థానాల గడువు ముగుస్తున్నా... ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకా మూడు వారాల టైమ్ ఎన్నికకు ఉంటుంది. ఈ లెక్కన ఈపాటికే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.రోజూ రోజుకూ రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం దేశంలోని చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించుకున్నాయి. దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నిక జరిగితే ఎమ్మెల్యేలంతా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. కరోనా భయంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. సీఈసీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో శాసనమండలి ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని సమాచారం.
ఇటీవలే భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తుంటే.... ఎన్నికల ప్రచార ర్యాలీలకు అనుమతినివ్వడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలకు అనుమతినిస్తూ...కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన ఇసిపై మర్డర్ కేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఇన్ని కేసులు పెరిగిపోవడానికి నైతిక, ఏకైక బాధ్యతంతా ఇసిదేనని ఆయన మండిపడ్డారు. 'ఎన్నికల అధికారులపై మర్డర్ కేసులు నమోదు చేయండి. కోర్టులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ...కరోనా నిబంధనలు అమలు చేయడంలో ఇసి విఫలమైంది' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల వల్లే అక్కడ కరోనా కేసులు పెరిగాయని విపక్షాలు మండిపడ్డాయి. దీంతో సీఈసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసింది. ఐతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలను వాయిదా వేసింది ఈసీ.
దేశంలో జరగాల్సి ఉన్న ఉప ఎన్నికలను సీఈసీ వాయిదా వేయడం, గతంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, దేశంలో కొవిడ్ విజృంభణ వంటి పరిస్థితుల్లో తెలంగాణలో శాసనమండలి ఎన్నికలు వాయిదా పడే అవకాశమే ఎక్కువని భావిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లోనూ పలు రాష్ట్రాల్లో జరగాల్సిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ కొన్ని నెలల వరకు వాయిదా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక కూడా అలాగే వాయిదా పడింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికలు గతంలో కొన్ని రోజులు వాయిదా పడ్డాయి.