విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాం... హరీష్ రావు
posted on Nov 3, 2014 3:31PM

నవంబర్ 2 నుంచి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణాబోర్డు తీర్పులో లేదని, అందువల్ల శ్రీశైలంలో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని ఆదేశించామని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, పీయూష్ గోయెల్‌లను కలసి తెలంగాణ సమస్యలను, ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలను చెప్పామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. శ్రీశైలం జల విద్యుత్‌కి ఏపీ అడ్డంకులు కల్పిస్తోందని, ఈనెల 2 తర్వాత శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయరాదని బోర్డు తీర్పులో లేదని ఉమాభారతికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. అందుకు ఉమాభారతి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించమని తనకి చెప్పారన్నారు. కృష్ణా బోర్డుకు తమ ప్రభుత్వం మూడు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. నీటి కేటాయింపులు లేని హంద్రీ నావాకు ఇప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశామని హరీష్ రావు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ని కలసి కరెంటు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందో కూడా వివరించామని, త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని పీయూష్ గోయెల్ హామీ ఇచ్చారని హరీష్ రావు తెలిపారు.