బుల్లెట్టు బండెక్కి పాతబస్తి పోయే ధైర్యం కేటీఆర్ కు ఉందా?  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హాట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. హుజురాబాద్ కేంద్రంగా రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. ప్రజా సమస్యలపై నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జన జీవనం స్థంభిస్తోంది. దీంతో వరదల విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడుగా వెళుతున్నారు కమలం నేతలు. తాజాగా శనివారం హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. వరదలు పోటెత్తడంతో పలు లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం పాతబస్తిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి.

పాతబస్తీలో వరదల నేపథ్యంలో బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మున్సిపల్  శాఖ మంత్రి కేటీఆర్ కు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. నగరంలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో చూసొద్దాం రండి అంటూ ఆహ్వానించారు. బుల్లెట్ బండి పై పాతబస్తీ పోదాం వస్తవా కేటీఆర్ అంటూ సవాల్ చేశారు రాజా సింగ్. భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగుతున్నాయని, నీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి వెళుతోందని, జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని రాజాసింగ్ వివరించారు.

"నిధుల గురించి, పాతబస్తీ అభివృద్ధి గురించి మీరు పదేపదే శాసనసభలో చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనిద్దరమే వెళ్లి చూసొద్దాం. నా బుల్లెట్ బండిపై మొదట గోషామహల్ నియోజకవర్గంలో పర్యటిద్దాం, ఆ తర్వాత పాతబస్తీలో పర్యటిద్దాం" అని తెలిపారు. భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో రియాలిటీ ఎలా ఉందో మీరే చూడొచ్చు...  ఏం అభివృద్ధి జరిగిందో మీ అంతట మీరే తెలుసుకోవచ్చు! అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజా సింగ్ సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.