కేసీఆర్ పై రగిలిపోతున్న ఉద్యోగులు.. మాటిచ్చి తప్పారంటూ నిప్పులు...

పీఆర్సీ ఆలస్యంపై తెలంగాణ ఉద్యోగులు రగిలిపోతున్నారు. పీఆర్సీ గడువు దాటిపోయి ఇప్పటికే 20 నెలలు గడిచిపోగా, మరోసారి వేతన సవరణ కమిషన్ గడువును పెంచడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆశించినస్థాయిలో, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం అదనపు గంటలు పనిచేస్తున్నా, పీఆర్సీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

వేతన సవరణ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు... మొన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రకటన వస్తుందని ఆశించారు. అయితే, వేతన సవరణ కమిషన్‌ గడువును వరుసగా మూడోసారి పొడిగించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు కమిషన్ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వరకు పొడిగించమేంటని మండిపడుతున్నారు.

గడువు ప్రకారం 2018 జులై ఫస్ట్‌ నుంచి పీఆర్పీ అమలు కావల్సి ఉంది. అయితే, 2018 ఆగస్టులో వేతనాలు పెంచుతామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు, కానీ, ఇఫ్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే, కాస్త ఆలస్యమైనా, ఉద్యోగులు ఆశించినదాని కంటే ఎక్కువగానే పీఆర్సీ ప్రకటిస్తారని మంత్రులు అంటున్నారు. అయితే, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం అదనపు గంటలు పనిచేస్తున్నామంటోన్న ఉద్యోగులు... పీఆర్సీ విషయంలో ఆలస్యం చేస్తూ నిరాశపర్చొద్దని అంటున్నారు.