శత్రు దుర్బేధ్యం ట్రంప్ కారు.. బీస్ట్ ప్రత్యేకతలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కోసం అహ్మదాబాద్‌, ఆగ్రా, ఢిల్లీలో కట్టుదిట్టమైన కేంద్ర ప్రభుత్వం.... భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే, ట్రంప్ పర్యటించనున్న ప్రాంతాలను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, భారత పర్యటనలో ట్రంప్ వినియోగించే కాన్వాయ్ లో, బీస్ట్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన బీస్ట్‌ కారు ప్రత్యేకతలు మీకోసం.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే బీస్ట్ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని పిలుస్తారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా ఉండేలా రూపొందించారు. అయితే ట్రంప్ కాన్వాయ్‌లో ఏకంగా12 బీస్ట్ కార్లుంటాయి. ప్రపంచంలోని ఏ మూలకు ట్రంప్ వెళ్లినా.... ఈ బీస్ట్ కార్లు వెంట నడవాల్సిందే. ఈ కారు అద్దాలు 5 అంగుళాల మందం కలిగిన స్టీల్‌, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేస్తారు. దాంతో, ఎలాంటి బాంబు పేలుళ్లనైనా ఈ కారు తట్టుకుంటుంది. అంతేకాదు, అత్యంత విలాసవంతమైనది. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది. ఇక, కారు టైర్లు ఎట్టి పరిస్థితుల్లో పంక్చర్‌ అవకుండా ఉండేలా ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టైర్​పేలినప్పటికీ రిమ్‌తోనూ కారు నడవగలుగుతుంది. బోయింగ్‌ 757 విమానానికి ఉండే డోర్లు బీస్ట్‌ కారుకు ఉంటాయి. ఇక, ట్రంప్ ప్రయాణించే కారులో ఆయుధాలు అమర్చి ఉంటాయి. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. అవసరమైతే బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే, గ్యాస్‌, రసాయనాల వంటివి కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే భాష్పవాయువును ప్రయోగించవచ్చు

అంతే కాకుండా రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నైట్ విజన్ కెమెరాల ద్వారా స్పష్టంగా కనిపించే సదుపాయం కూడా ఉంది. కారులో డ్రైవర్‌, సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ మాత్రమే ఉంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కారును నడిపేలా వీరికి శిక్షణ ఇస్తారు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు ఈ కారు. డ్రైవర్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉండే జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ..సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలందిస్తుంది. నేరుగా వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. 

ఇక, కారు డీజిల్‌ ట్యాంక్‌ ఏ పరిస్థితుల్లోనూ పేలకుండా ఉండేలా ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంటుంది. అధ్యక్షుని సీటు వద్దే శాటిలైట్‌ ఫోన్‌, అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ఇక వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూడా కూర్చోవచ్చు. లోపలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. మొత్తానికి, శత్రుదుర్బేధ్యంగా ఉండే బీస్ట్ కారు.... ఎలాంటి దాడులనైనా తట్టుకోవడమే కాకుండా, మినీ వైట్ హౌస్ గా పనిచేయనుంది.