తెలంగాణలో ఒమిక్రాన్ తొలి కేసు? మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..

ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రాణాంతంక వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కచ్చితంగా వసూలు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారిలో ఒక మహిళకు పాజిటివ్గా తేలిందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమె పరీక్షల నమూనాను జినోమ్కు పంపించామని ఆయన తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆ మహిళను రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా పూర్తిగా నివారణ కాలేదు… కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వేస్తున్న వ్యాక్సిన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న వారిలో 25 లక్షల మంది ఇంకా రెండో డోస్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో 5.90 లక్షల మంది, మేడ్చల్ జిల్లాలో 4.80 లక్షల మంది, రంగారెడ్డి జిల్లాలో ఇంకా 4.10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని డీహెచ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 25 లోక్షల మంది వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ వైరస్ డెల్టా వైరస్ కన్నా ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల నుంచి మూడు రోజుల్లో మూడు దేశాల నుంచి 24 దేశాలకు వైరస్ వ్యాప్తి చేందిందని తెలిపారు.

మాస్క్ ధరించడంతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలను కూడా కచ్చితంగా ప్రజలంతా పాటించి తీరాల్సిందే అని డీహెచ్ తెలిపారు. వైరస్ నుంచి ముప్పు తెచ్చుకోకూడదంటే జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకుని ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలని డీహెచ్ హితవు పలికారు. ఒమిక్రాన్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఆపీసులలో కూడా మాస్క్ ధరించి తీరాల్సిందే అని ఆయన వార్న్ చేశారు. వ్యాక్సిన్పై కచ్చతమైన నిబంధనలు కూడా ప్రభుత్వ అనుమతితో రూపొందించనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.