పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు
posted on Nov 22, 2025 1:32PM

సుప్రీం మార్గదర్శకాల మేరకు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఎట్టకేలకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశాన్నిపక్కన పెట్టేసింది. ఇటీవలి జూబ్లీ ఉపఎన్నికలో ఘన విజయంతో కాంగ్రెస్ లో, కాంగ్రెస్ క్యాడర్ లో పెరిగిన జోష్ అలా ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
అందుకే ఇక జాప్యం లేకుండా స్థానిక ఎన్నికలకు రెడీ అయిపోయారు. దీంతో ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రప్రభుత్వం ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అవి కాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది. ఆ మేరకు శనివారం (నవంబర్ 22) జీవో జారీ చేసింది. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా జీవో జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్థతిలో అమలు చేస్తారు. అన్నివర్గాలకూ సమాన న్యాయం జరిగేలా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొంది. గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనను ఈ జీవోలో చేర్చింది. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైనట్లైంది. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ త్వరలో అంటే డిసెంబర్ రెండో వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.