ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ ముందస్తు ప్రచారం.. దేనికి సంకేతం?
posted on Nov 22, 2025 10:09AM

ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతలా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు రాజీనామా మార్గాన్ని ఎన్నుకుంటార్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో సందేహం లేదు. ఈ మేరకు ఇటీవల ఆయన తన అనుచరులతో, ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించి చర్చలు జరిపారు. అంత వరకూ నిజమే. కానీ తన రాజీనామా విషయాన్ని ఆయన ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేయే. ఆయన రాజీనామా చేసిన తరువాత మాత్రమే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి తెరలేపేసింది. పోస్టర్లతో హడావుడి చేసేస్తోంది. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార సందడి ప్రారంభించేసింది. ఇక ఏపీలో వైసీపీ తరహాలో రప్పా రప్పా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటూ నానా హంగామా చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు నిన్నటి జూబ్లీ ఉప ఎన్నిక, అంతకు ముందటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఇలాగే ముందస్తు హడావుడితో హోరెత్తించి ఫలితాల్లో చతికిల బడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.