వాహ్.. క్యా సీన్ హై.. కేటీఆర్, జగన్ పక్కపక్కనే
posted on Nov 22, 2025 10:53PM

బీఆర్ఎస్, వైసీపీల బంధం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేకతే వారి మైత్రీ బందానికి అసలు, సిసలు కారణంగా పరిశీలకులు చెబుతారు. ఆ వ్యతిరేకత కారణంగానే.. ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టడం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయగలిగినంత సాయం చేసింది. అందించగలిగినంత సహకారం అందించింది.
ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి అవసరమైతే జగన్ విజయం కోసం తాను ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానని కూడా అన్నారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తరువాత జగన్ కేసీఆర్ తో సఖ్యంగా మెలిగారు. ఆ సఖ్యత ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సహాయం చేయడానికి నాగార్జున సాగర్ జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనకు అనుకూలంగా ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అదేమీ ఫలించ లేదనుకోండి అది వేరే సంగతి.
2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన అరెస్టు ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలను కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు చేయాలనుకుంటే అక్కడ చేయండి కానీ ఇక్కడ కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ పరాజయం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏపీలో జగన్ పార్టీ పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందని ఆ ఫలితాల తరువాత కేటీఆర్ అన్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రాబాబుకు వ్యతిరేకంగా కుమ్మక్కు రాజకీయాలు నెరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో రెండూ పార్టీలూ అధికారం కోల్పోయిన తరువాత కూడా కేటీఆర్, జగన్ ల మధ్య అనుబందం అలాగే సాగుతోందనడానికి పలు ఆధారాలు ఉన్నాయి.
ఇటీవల జగన్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ జగన్ పట్ల తమ అభిమానాన్ని ఎన్నడూ దాచుకోలేదు. తాజాగా జగన్, కేటీఆర్ లు ఇరువురూ బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పక్కపక్కన కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బెంగళూరులో శనివారం నవంబర్ 22) జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుసుకున్నారు. పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు వారిద్దరు కలిసి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.