ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ కిరికిరి.. యాసంగి రైతుకు దారేది? 

యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఒక్క గింజ వరి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనిగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు. అందుకు కారణం కూడా ఆయన అంత స్పష్టంగానూ చెప్పారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్ కొనమని తెగేసి చెప్పింది. కాబట్టి, రాష్ట్రానికి కొనే ఆర్థిక స్థోమత, నిల్వ సామర్ధ్యం లేవు కాబట్టి, రాష్ట్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా చావు కబురు చల్లగా చెప్పారు. 

నిజానికి ఇదే ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా, వరి పంట విస్తీర్ణం 78లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు చేరినా, 225 లక్షల టన్నులున్న వరి పంట ఇంకా పెరిగినా, వరి పంటకు బ్రహ్మాండమైన ధర వస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. వరి పంటను ప్రోత్సహించాలని, సభాముఖంగా వ్యవసాయ మంత్రిని ఆదేశించారు. అంతే కాదు రాష్ట్రంలో వరి పంట ఇంకింత పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందని హామీ ఇచ్చారు. అయితే,అదే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వేషం మార్చారో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో ఆయన స్వరం మారి, చివరకు కేంద్రం కొంటేనే కొంటాం, అనే వరకు వచ్చారు. కేంద్ర చేతులు ఎత్తేసింది కాబట్టీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందని చెప్పుకొచ్చారు.  

అయితే, ఇక్కడ తప్పు  కేంద్రానిదా? రాష్ట్రనిదా? అనే చర్చను పక్కన పెట్టి, ఇప్పుడు రైతు ముందున్న ప్రత్యాన్మాయం ఏమిటని ఆలోచిస్తే, శూన్యం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు  పండ్ల తోటల సాగుకు అవసరమైన పనిముట్లు ఇతర ఇంపుట్స్’పై ఇచ్చిన సుబ్సిడీలను ఎత్తివేసింది. పందాల్ తోటల సాగుకు మంగళం పాడింది. పత్తి.  మిర్చి, పప్పు ధాన్యాలు, ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు,  పసుపు  ఏ పంటకు సరైన ధర రాక రైతులు  దగా పడ్డారు.ఇదే విషయాన్ని, ఈరోజు రేవంత్ రెడ్డి  ప్రభుత్వానికి గుర్తు చేశారు. నిజానికి, ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నట్లుగా,  ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెరాస, బీజేపీ పార్టీలు కలిసి రైతులను మోసంచేస్తున్నాయి. రాజకీయ చదరంగంలో పావులుగా చేసి ఆడుకుంటున్నాయి అన్నది నిజం. 

ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలు, మెట్టపంటలపై రాయితీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు వరి పండిస్తున్నారని అన్నారు.  ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని ప్రశ్నించారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా అని పేర్కొన్నారు. ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ రైతులను బీజేపీ  మోసం చేసిందని... చక్కెర పరిశ్రమలను మూసివేసి కేసీఆర్‌ చెరకు రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయన్నారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నిజం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడా ఇక్కడా అధికారంలో ఉన్న బీజేపీ, తెరాస రాజకీయ ప్రయోజనాలకోసం ఆడుతున్ననాటకంలో రైతులు బాలి పశువులు అవుతున్నారని పరిశీలకులు బావిస్తున్నారు.