తెలంగాణను కుదిపేస్తున్న కెల్విన్‌ ఎవరు!

 

డైరక్టర్‌ – పూరీ జగన్నాథ్‌, హీరో – రవితేజ, హీరోయిన్‌ – చార్మి, విలన్‌ – సుబ్బరాజు, ఆర్ట్‌ డైరక్టర్ – చిన్నా, కెమెరామెన్ – శ్యామ్ కె. నాయుడు, ఇతర నటులు – ముమైత్‌ఖాన్, తరుణ్‌, నవదీప్‌... ఇదంతా ఏదో రాబోయే సినిమా బృందం కాదు. సినిమారంగానికే సినిమా చూపిస్తున్న డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నవారి పేర్లు. మా బిడ్డ ముత్యం అని తల్లులు చెబుతున్నా, సిగిరెట్‌ కూడా ముట్టుకోనని వారే చెబుతున్నా... మొత్తానికి ఎక్కడో ఏదో గోల్‌మాల్ జరిగిందన్న విషయంలో మాత్రం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇలా వీరందరూ అడ్డంగా బుక్కయి పోవడానికి కారణం, ఒక వ్యక్తితో వారికి ఉన్న దగ్గర సంబంధాలే. అతనే కాల్విన్‌! ఇంతకీ ఎవరీ కాల్విన్‌?

 

కెల్విన్ లేదా కాల్విన్‌గా రోజూ వార్తల్లో నిలుస్తున్న సదరు వ్యక్తి పూర్తి పేరు Calvin Mascarenhas. ఓల్డ్‌ బోయినపల్లిలో గుట్టుగా జీవించే కుటుంబం ఇతనిది. తండ్రి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, తల్లి ఇంకా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఒక తమ్ముడు. చుట్టుపక్కల వారి దృష్టిలో అదో గౌరవప్రదమైన కుటుంబం. ఆ వీధిలోవారికి కెల్విన్‌ అన్నా కూడా మంచి అభిప్రాయమే ఉంది. కొంతమంది స్నేహితులతో రావడం, సందు చివర కాసేపు ఓ దమ్ములాగి తన ఇంటికి వెళ్లిపోవడం.... ఇదే కెల్విన్‌ గురించి వారికి తెలిసింది. అతని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ శబ్దంతోనే, కెల్విన్ వీధిలోకి వస్తున్నట్లు తెలిసేది.

 

కెల్విన్‌ చాలా నిదానస్తుడని పేరు. అతను ఇంత పెద్ద డ్రగ్స్‌ రాకెట్‌లో ఇరుక్కున్నాడంటే... బోయినపల్లిలో ఎవ్వరూ ఇప్పటికీ నమ్మేందుకు సిద్ధంగా లేరు. అంతదాకా ఎందుకు! కెల్విన్‌ తండ్రి సైతం ‘మా పిల్లవాడు తన పని తాను చేసుకుపోయే మనిషి. బుద్ధిగా చదువుకునే కుర్రాడు,’ అంటూ వాపోయారు. నిజంగానే కెల్విన్ BBM, MBA లాంటి ఉన్నత విద్య చదివినట్లు తెలుస్తోంది. కానీ పరిస్థితులు వేరే విషయాలు కూడా చెబుతున్నాయి.

 

కెల్విన్‌ను ఇంతకముందే 2013లో ఓసారి డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ జులై 2న అతన్ని అరెస్టు చేసినప్పుడు కూడా కెల్విన్‌ దగ్గర పెద్ద మోతాదులో నిషేధిత డ్రగ్స్‌ దొరికాయి. అతనికి ఈ దందాలో తోడ్పడుతున్న అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ ఖుద్దుస్‌ అనే వ్యక్తులు కూడా పట్టుబడిపోయారు. ఏదో రొటీన్‌ విచారణలో భాగంగా వీరి సెల్‌ఫోన్‌ రికార్డులని పరిశీలించిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది

 

ఈవెంట్‌ మేనేజర్‌ ముసుగులో కెల్విన్ సినిమాతారలు, హై ఫై సొసైటీలోని యువతకు దగ్గరయ్యేవాడని తేలింది. నిదానంగా వారికి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. ఇక ఆ తర్వాత ఎంతటివారైనా కెల్విన్‌ వెంటపడాల్సిందే! ప్రస్తుతం సిట్‌ విచారణలో పాల్గొన్న కొందరు తారలతో కెల్విన్‌కు వందలాది ఫోన్ సంభాషణలు జరిగేవంటే.... అతని వెంట వాళ్లు ఎంతగా వెంపర్లాడేవారో తెలుస్తోంది.

 

సరే! సినిమాతారలకి ఉండే సమస్యలు, వారుండే ప్రపంచం వేరనుకుందాం. కానీ కెల్విన్‌ విషయంలో ప్రభుత్వం ఇంత సీరియస్‌గా ముందుకు వెళ్లడానికి మరో కారణం ఉంది. అదే చిన్నపిల్లలకు సైతం డ్రగ్స్‌ను అలవాటు చేయడం. పట్టుమని 13 ఏళ్లయినా లేని స్కూల్‌ పిల్లలకు కెల్విన్‌ బ్యాచ్‌ డ్రగ్స్ అలవాటు చేసేది. ఆన్‌లైన్లో కావల్సినంత మొత్తంలో డ్రగ్స్ తెప్పించుకొని, వాటిని రిటైల్‌గా అమ్మేవారు. ఈ దందా కోసం, పసిపిల్లలకి ఐస్‌క్రీం మీద డ్రగ్స్ పూసి అలవాటు చేసిన సందర్భాలు కూడా కనిపించాయి.

 

నిజానికి డ్రగ్స్‌ అనేది ఒక ఊబిలాంటిది. తెలిసో తెలియకో ఒకసారి డ్రగ్స్ రుచి చూసినవారు, మళ్లీమళ్లీ దాని రుచి కోసం తపించిపోతారు. వాళ్ల మెదడు తీరే మారిపోతుంది. డ్రగ్స్‌ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడిపోతారు. వాటిని సంపాదించేందుకు డబ్బు కావాలయ్యే! ఆ డబ్బు కోసం తామే స్వయంగా డ్రగ్స్ అమ్మే వ్యాపారంలోకి దిగిపోతారు. కెల్విన్‌ కూడా ఇలా ఊబిలోకి దిగబడిపోయాడని జాలిపడేవారు ఉన్నారు. కెల్విన్‌ తలదన్నే ఎందరో డ్రగ్స్ వ్యాపారులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని హెచ్చరించేవారూ ఉన్నారు. కానీ మన సమాజంలోకి డ్రగ్స్‌ ఎంతగా చొచ్చుకుపోయే చెప్పే గాయంగా కెల్విన్ గుర్తుండిపోతాడు.

- నిర్జర