టీకాంగ్రెస్ నేతల్లో "అసహనం" పెరిగిందా..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా సరిగా ప్రచారం చేసుకోలేక బొక్కబొర్లాపడింది కాంగ్రెస్ పార్టీ. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సరైన నాయకులు ఉన్నా నడిపించే నాయకుడు లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. రాష్ట్రాన్నిచ్చినా ప్రజలెందుకు తిరస్కరిస్తున్నారో అర్థంకాక..వరుస ఓటములతో కోలుకోలేకుండా ఉన్న టీకాంగ్‌ నేతలకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ సమయంలో వారిలో  "ఆసహనం " పెరిగిపోయి ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టాల్సింది పోయి తమవారిపైనే నిందలు వేసుకొంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారు. రోజుకొక నేత తమలోని అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు.

 

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు తన అసంతృప్తిని ఎవరి మీద చూపించాలో తెలియలేదు. అందుకే మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు. మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలు తమను పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిణామంతో మీడియా కాంగ్రెస్‌కు మరింత దూరమైంది. కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సీఎల్పీ నేత జానారెడ్డిని దుర్భషలాడారు. ఇక నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ అధినాయకత్వం మీదే దాడికి దిగారు. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.  

 

ఆ తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా రాజకీయాలంటే పెద్దగా తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేశారన్నారు. కేసీఆర్ ముందు ఏమాత్రం నిలబడలేని ఉత్తమ్‌కుమార్ వల్ల రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కోమటిరెడడ్డి విమర్శించారు. అక్కడితో ఆగకుండా నేనే పీసీసీ అధ్యక్షుణ్ణి అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాణ్ణి..లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాయకుల అసందర్భ ప్రేలాపనలు కార్యకర్తలకు చీరాకు తెప్పిస్తున్నాయి. ఐకమత్యంగా ఉండి పార్టీని బతికించుకోవాల్సింది పోయి మీలో మీరే తన్నుకుంటున్నారని సగటు కాంగ్రెస్ కార్యకర్త తల బాదుకుంటున్నాడు. మరి టీకాంగ్ నేతలు ఇక్కడితో ఆగుతారా..? లేదంటే తమ విమర్శల జడివానలో తమ వారినే తడుపుతారా ..? అన్నది వేచి చూడాలి.