మాయని మచ్చ..

ఆపరేషన్ బ్లూస్టార్...స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యయం. ఉక్కు మహిళగా కీర్తి శిఖరాలు అధిరోహించిన ఇందిరాగాంధీ ప్రాణాలను తీసుకున్న యమపాశం. ఈ ఘటనకు నేటితో 32 సంవత్సరాలు. 1970వ దశకంలో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆరంభమైన ఈ ఉద్యమానికి పంజాబ్ యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ ఉద్యమానికి నాయకుడు బింద్రేన్‌వాలే. రోజు రోజుకి వీరి ఆగడాలు మీతిమీరడంతో పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. వీరంతా అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని అడ్డాగా చేసుకుని ఉద్యమాన్ని మరింత వ్యాపింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశించారు.

 

ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన భారత సైన్యం స్వర్ణదేవాలయాన్ని చుట్టు ముట్టి కాల్పులు జరిపింది. ఈ దాడిలో తీవ్రవాదులు సహా 400 మంది మృతి చెందారు. ఎంతో మంది అమాయకులు గాయపడ్డారు. అనంతరం జరిగిన ప్రతీకార హత్యాకాండతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం ప్రతి సిక్కు మదిలో మెదిలి ప్రతీకార జ్వాలగా మారి ప్రధాని ఇందిర హత్యకు దారి తీసింది. ఈ ఆపరేషన్ జరిగి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ గాయం సిక్కులను వెంటాడుతూనే ఉంది. అందుకే ఈ రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణలు చేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా కొన్ని రాడికల్ గ్రూపులు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో స్వర్ణదేవాలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్‌లు ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.