సభా సమరం.. ఈసారి కేసీఆర్ హాజరా? గైర్హాజరా?!
posted on Dec 5, 2024 7:48AM
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాలలో పలు అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి అర్హులైన రైతులకే రైతు భరోసా దక్కేవిధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్ చట్టంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయ్యింది. ఈ సంవత్సరకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తరఫున నేతలు సభలో ఎంత గట్టిగా గళమెత్తినా, కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం సభలో కాంగ్రెస్ దే పై చేయి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ రెండు సందర్భాలలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో లేకపోవటంతో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభ్యులు దీటుగా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ సభలో ఉండిఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న భావన గత రెండు సందర్భాలలోనూ బీఆర్ఎస్ శ్రేణులలో వ్యక్తం అయ్యింది. కేసీఆర్ మాత్రం ఒక్కరోజు మినహా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని, అవసరమైన పథకాలకు, ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఇక నుంచి అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అంతుచూస్తానంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు కేసీఆర్ చుక్కలు చూపించడం ఖాయమని.. రేవంత్ ఇక కాస్కో అంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అప్పట్లో పోస్టులు పెట్టాయి. అయితే, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో బీఆర్ ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై అనేక అవినీతి, అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ , కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి , విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతికి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై విచారణకు సైతం ఆదేశించారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు. అధికారం కోల్పోయిన నాటినుంచి ఆయన కేవలం ఫాంహౌస్‌కే పరిమితం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే గతంలో కొందరు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్ వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, సంవత్సర కాలం సమయం ఇచ్చిన తరువాత ప్రభుత్వం పనితీరు, విధానాలపై ప్రశ్నిద్దామని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయ్యింది. అంటే కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. దీంతో ఈనెల 9నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ సభకు హాజరౌతారనీ, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతారనీ ఆశాభావంతో ఉన్నాయి.
అన్నిటికీ మించి ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని నిలదీసేందుకు ప్రతిపక్షానికి మంచి అవకాశమని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల తొలగింపు, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల తొలగింపు తదితర అంశాలపై రేవంత్ సర్కార్ ను నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి ఇదో మంచి అవకాశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి పై చేయి సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ సభకు వచ్చి గళం విప్పాల్సి ఉంటుందనీ, ఆయన గైర్హాజరైతే మాత్రం విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే అవుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి డిమాండ్ మేరకు, బీఆర్ఎస్ శ్రేణుల విజ్ఞప్తుల మేరకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా.. లేకుంటే ఈసారికూడా డుమ్మా కొడతారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది.