తెలంగాణ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు
posted on Nov 7, 2014 9:24AM

తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సభలో అన్ని సమస్యల గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని ప్రకటించారు. అవసరమైతే శాసనసభ సమావేశాలు మరో 10 రోజులైనా పొడిగిస్తామని తెలిపారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సభ్యులు వ్యవహరించారని కేసీఆర్ కోరారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ సమస్య మీద సభలో చర్చించాలని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. ఇదిలా వుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.