నేటి నుండి శాసనసభలో తెలంగాణా బడ్జెట్ పై చర్చ
posted on Nov 7, 2014 8:48AM
.jpg)
నేటి నుండి శాసనసభలో తెలంగాణా బడ్జెట్ పై చర్చ ఈరోజు నుండి తెలంగాణా బడ్జెట్ పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ మొదలవబోతోంది. తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ బడ్జెట్ పై చర్చ ప్రారంభించబోతున్నారు. బంగారి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడే పడే బడ్జెట్ ఇదని అధికార పార్టీ వాదిస్తుంటే, ప్రజలను మభ్యపెట్టడానికే తయారుచేసినదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈరోజు నుండి సభలో బడ్జెట్ పై చర్చ జరగవలసి ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను లేవనెత్తి అధికార పార్టీని నిలదీసేందుకు సిద్దం అవుతుండటంతో, తెరాస సభ్యులు కూడా వారిని అంతే ధీటుగా డ్డీ కొనేందుకు సిద్దం అవుతున్నారు. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపైనే ప్రధానంగా యుద్ధం జరగబోతోంది కనుక బడ్జెట్ పై చర్చ పక్కదారి పట్టే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అందుకే అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా రాష్ట్ర విద్యుత్ పరిస్థితులు, ఉత్పత్తి, సరఫరా, తీసుకోవలసిన చర్యలు, దానిలో ప్రభుత్వ వైఫల్యాలు వంటి వివరాలను విద్యుత్ రంగ నిపుణులను సంప్రదించి మరీ అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకొంటుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కూడా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు, సభలో గందరగోళం, నిరసనలు అన్నీ షరా మామూలుగానే జరిగిపోవచ్చును.