టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఇదంతా డ్రామాలో భాగం
posted on Oct 6, 2015 12:28PM

సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ విపక్ష నేతలైన 32 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రైతు రుణమాపీలపై.. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు మాట్లాడుతూ.. రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారని.. రైతులకు ఒక్కసారే రుణమాఫీ చేయాలని.. తద్వారా వారికి ఊరట కలుగుతుందని డిమాండ్ చేశారు. అంతేకాదు అధికార పార్టీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది.. మరి రైతులకు ఒక్కసారే రుణమాఫీ చేస్తే వచ్చే నష్టమేంటని ఆందోళనకు దిగడంతో 32 మంది విపక్ష నేతలను (బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు) సస్పెండ్ చేశారు. అయితే శాసనసభ నుండి టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంపై చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నేతలు ప్రజలకోసం పోరాడుతున్నారు.. అందుకే సస్పెండ్ చేశారు.. ఇదంతా డ్రామాలో ఓ భాగం అని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు అసెంబల్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంగన్ వాడీ సమస్యలపై చర్చలు మొదలయ్యాయి.