150 వైన్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు..గడుపు పొడిగింపు
posted on Oct 19, 2025 12:42PM

తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో, మద్యం షాపుల టెండర్ల గడువుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల గడవును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నెల 23వ తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను సైతం వాయిదా వేశారు.
శనివారం బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపిందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా ఈ దరఖాస్తులు తగ్గాయాని సమాచారం.అసలు అయితే శనివారం సాయంత్రంతో ఈ మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగియాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు శనివారం భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ ఒక్క రోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అదలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ దాదాపు 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అదీకూడా ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని మద్యం దుకాణాలకు ఆమె అధికంగా దరఖాస్తు చేసినట్టు ఒక ప్రచారం అయితే సాగుతోంది. సంగారెడ్డి జిల్లాల్లో 101 మద్యం దుకాణాలకు 4,190 దరఖాస్తులు రాగా.. మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 1,369 టెండర్లు వచ్చాయి.