ప్రధాని వార్నింగ్... 75 గంటల్లో 303 నక్సలైట్లు సరెండర్
posted on Oct 19, 2025 12:58PM

ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం, జాతీయ భద్రత, యువత భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అనేది కేవలం పదం మాత్రమేనని.. వాస్తవానికి అది మావోయిస్టు ఉగ్రవాదం అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో అభివృద్ధి చెందిన అర్బన్ నక్సల్స్ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఈ ఉగ్రవాదం గురించి దేశ ప్రజలకు తెలియకుండా అర్బన్ నక్సల్స్ అనే వ్యవస్థ పెద్ద ఎత్తున దాచిపెట్టే పని చేసిందన్నారు.
చాలా మంది మావోయిస్టు ఉగ్రవాద బాధితులు తమ కాళ్లు, చేతులు పోగొట్టుకుని ఢిల్లీకి వచ్చినా.. వారి బాధను బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ కాంగ్రెస్ వ్యవస్థ అడ్డుకుందని మోదీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని తిరిగేవాళ్లు.. ఇప్పటికీ మావోయిస్టులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకున్నారని ప్రధాని తెలిపారు.