బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ స్థానిక ఎన్నికలు.. లింకేటి?
posted on Sep 9, 2025 4:33PM

తెలంగాణలో స్థానిక సమరం మరో వాయిదా ఖాయం అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తెలంగాణ స్థానిక ఎన్నికలు కోర్టు స్పష్టమైన గడువు విధించిన తరువాత కూడా మళ్లీ మరో మారు వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తున్నది. వాస్తవానికి స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా కాలమైంది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వాటి గడువు ముగిసి కూడా ఏడాది దాటింది.
అప్పటి నుంచీ కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఈనేపధ్యంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తాం, అప్పుడు నిర్వహిస్తామంటూ ముహూర్తాలు ఖరారు చేసి ఉజ్జాయింపుగా తేదీలనూ ప్రకటించేస్తున్నా.. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. అసలీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు.
ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుబడుతుండటంతో కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఇసుమంతైనా లేదన్న విషయం దాదాపు స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణకు తగినట్లుగానే ఇటీవలి మంత్రివర్గ సమావేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించే వరకూ స్థానిక పోరుకు వెళ్లవద్దన్ననిర్ణయం తీసుకున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మరి కొంత గడువు కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అదే జరిగితే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేనట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. వారి వద్ద నుంచి ఈ నెల 30లోగా ఎటువంటి నిర్ణయం వెలువడకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కారణాన్ని చూపుతూ కోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా బీహార్ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణ స్థానిక సమరం వాయిదా పడటమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందు కోసం కోర్టును స్థానిక పోరును మూడు నుంచి నాలుగు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ నుంచి బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంతకీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో లింకేమిటంటే.. బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్నది రేవంత్ బావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కోర్టును ఆశ్రయించైనా సరే స్థానిక ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ పట్టుబ డుతుందని చెబుతున్నారు.