ఏపీలో రుణంపై రణం.. రంగుల కోసమేనా! అంతా మీరే చేశారు..
posted on Aug 31, 2020 4:43PM
అమరావతిపై పోరు సాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య అప్పులపై వార్ ముదురుతోంది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో జగన్ సర్కార్.. మరిన్ని అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్నే అస్త్రంగా తీసుకుని టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. ఏడాదిలోనే లక్ష కోట్ల రుణం తీసుకున్న వైసీపీ సర్కార్.. మరిన్ని అప్పుల కోసం ప్రయత్నించడం దారుణమంటోంది టీడీపీ. జగన్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాలతో ఖజానాకు చిల్లు పడి ఇప్పటికే ప్రజలపై భారం పడిందని ఆరోపిస్తోంది. లక్ష కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టారో చెప్పాలంటున్న టీడీపీ.. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి.. తొలగించడానికే ఖర్చు చేశారని ఆరోపిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయం వంటి ముఖ్యమైన రంగాలకు నిధులే ఇవ్వని ప్రభుత్వం.. లక్ష కోట్లు ఏం చేసిందో చెప్పాలని ప్రతిపక్షం నిలదీస్తోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని, జగన్ సర్కార్ విధానాలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 90 వేల కోట్ల అప్పుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.5 లక్షల కోట్లకు రుణం పెరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూనే ఉంది. 15 నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నారని టీడీపీ చెబుతోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అవకాశంతో మరిన్ని అప్పులు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది జగన్ సర్కార్. ఇప్పటివరకూ రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో 3.5 శాతం మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వీలుంది. కానీ కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గినందున.. ఎప్‌ఆర్‌ఎం పరిమితిని పెంచుకునేందుకు కేంద్రం వీలు కల్పించింది. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 3.5 శాతం పరిమితి ఐదు శాతానికి పెరగబోతోంది. దీంతో ఏటా మరో రూ.20 వేల కోట్ల రూపాయలు అధికంగా అప్పులు తెచ్చుకునే అవకాశం ఏపీకి ఉండనుంది. అంటే వచ్చే నాలుగేళ్లలో మరో 80 వేల కోట్ల రుణం తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇతరత్రా మార్గాల్లోనూ ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ సమరానికి కారణమైంది.
జగన్ సర్కార్ చేసిన చట్ట సవరణపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలపై అదనపు భారం పడిందని, మరిన్ని అప్పులు చేస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు తెస్తే ఓకే గాని.. సొంత పబ్లిసిటీ ఈవెంట్లకు, వైసీపీ రంగులు వేయడానికి అప్పులు చేయడమేంటనీ మండిపడుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను మాత్రమే వాడుకుంటున్నట్లు చెబుతోంది. అన్ని రాష్ట్రాల మాదిరే తాము ముందుకు వెళుతున్నామని, కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని కవర్ చేసుకుంటుంది. బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న కేంద్రమే.. ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాలకు మరో రకంగా అవకాశం ఇచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఐదేండ్లలో టీడీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్లే గడ్డు పరిస్థితి వచ్చిందని కౌంటరిస్తున్నారు. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసి.. ప్రజా ధనాన్ని దోచుకున్న టీడీపీ కూడా అప్పులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ నేతలు. అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా.. ఎడాపెడా చేస్తున్న అప్పులతో తమపై భారం పడుతుందనే ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు అడ్డగోలు ఖర్చులు చేయకుండా నియంత్రణ పాటిస్తేనే ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.