ఒక్క రూపాయి జరిమానా కడతారా?.. జైలుకు వెళ్తారా?
posted on Aug 31, 2020 2:36PM
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్ 15 లోగా కోర్టులో రూపాయి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డిపాజిట్ చేయకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ పై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది.
న్యాయ వ్యవస్థను, సుప్రీంకోర్టు పని తీరును విమర్శిస్తూ జూన్ 27, 29 తేదీల్లో ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్లు చేశారు. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఇందుకు బాధ్యులని ట్వీట్ లో పేర్కొన్నారు.
మరో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తీరుని తప్పబట్టారు. ఎలాంటి మాస్క్, హెల్మెట్ ధరించకుండా నాగ్‌పూర్ లోని రాజ్‌భవన్‌లో ఓ బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల విలువైన బైక్ ని నడిపారని.. హెల్మెట్ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.

ఈ ట్వీట్లను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. ఈ ట్వీట్లు కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. అయితే, సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పేందుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రశాంత్ భూషణ్ అందుకు అంగీకరించలేదు. అవి తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయాలని, అందువల్ల తాను క్షమాపణ చెప్పబోనని ప్రశాంత్ భూషణ్ తేల్చి చెప్పారు.
ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు వాదనల సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకున్నారని తెలిపారు. వాక్ స్వాతంత్ర్యాన్ని కాదనలేం కానీ ఇతరుల హక్కులను కూడా గౌరవించాలన్నారు.
కాగా, ప్రశాంత్ భూషణ్ ఇప్పుడు ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తారా? లేక మూడు నెలల జైలు శిక్షతో పాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ కి దూరంగా ఉండటానికి సిద్దమవుతారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.