తెరాస సర్కార్ని రాళ్ళతో కొట్టాలి
posted on Nov 11, 2014 1:44PM

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని 12 గంటలపాటు నిర్బంధించిందని తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీటీడీపీ నాయకుడు రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ‘‘సమగ్ర సర్వే వల్ల పేదలకు న్యాయం జరగలేదు. సర్వేలో ఆస్తులను మాత్రమే అడిగారు. అప్పులను ఎందుకు అడగలేదు? సర్వే రోజున బస్సు డిపోలను మాత్రం మూసేశారు. బార్లను మాత్రం బార్లా తెరిచారు. కనీసం సర్వేముందు అఖిలపక్షం పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం. నిజామాబాద్ ఎంపీ పేరు రెండు ప్రాంతాల్లో నమోదు చేశారు. ఈ విషయంలో అధికారుల మీద ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలి. సమగ్ర సర్వేతో సంపూర్ణ సమాచారం సేకరించిన తర్వాత పెన్షన్ల కోసం వివరాలను ఏ విధంగా అడుగుతారు? వితంతువు మళ్లీ పెళ్లిచేసుకున్నారా అని వివరాలు అడగడం మన తెలంగాణ ఆడపడుచులను మనమే అవమానపరుచుకున్నట్లుంది. ఇలాంటి పనులు చేసిన ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టాలి. సమగ్ర సర్వే రోజు నమోదు కోసం మా ఇంటికి ఎవరూ రాలేదు. హైదరాబాద్‌లో 25 శాతం వరకు వివరాలు నమోదు కాలేదన్నారు. ఆధార్ కార్డు తరహాలో ప్రతీ చోట కౌంటర్లను తెరిచి ప్రజలకు సహకరించాలి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.