ఇంటి గేట్లు విరగొట్టి మరీ పట్టాభి అరెస్ట్.. ఏపీలో ఆగని అరాచకం..

ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టాభి ఇంటి గేట్లు విరగొట్టి మరీ పోలీసులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పట్టాభిపై 120బీ, 505, 504 సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు. 

తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చంద్ర అన్నారు. సెక్షన్‌ 120 బి కింద పట్టాభిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్‌ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పటమట పీఎస్‌లో కేసు నమోదయ్యిందని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా చూపించలేదని పట్టాభి భార్య చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకుముందు తనను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముందని టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదల చేశారు. వీడియోలో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని పట్టాభి స్పష్టం చేశారు.