ఎంతమంది గుడ్లు పీకారు జగన్ రెడ్డి? 

ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మహిళల మీద దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి వుండాలి అన్న జగన్ రెడ్డి.. రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారు.? అని ఆమె ప్రశ్నించారు. సీతానగరంలో దళిత యువతిపై అత్యాచారం కేసులో రెండు వారాలైనా పురోగతి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీశారు, 

సీతానగరం ఘటనలో నిందితులు వైపీపీకి చెందినవారు కావడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనిత ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఉదంతంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నిందితులు వైసీపీ వారు కాబట్టి మిన్నుకుండిపోయారా అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలను ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని… నేతిబీరకాయలో నేతి వుండదు.. జగన్ తెచ్చిన చట్టాల్లో నిబద్ధత వుండదు అని ఎద్దేవా చేశారు.నిందితుల వెనక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వసంతకృష్ణప్రసాద్ వున్నారని ఆరోపించారు. ఆర్కే ఇంట్లో సోదాలు చేస్తే నిందితులకు సంబంధించిన సమాచారం పూర్తిగా దొరుకుతుందని సలహా ఇచ్చారు.

జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో 520పైగా మహిళల మీద అత్యాచారాలు, దాడులు జరిగాయని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మహిళకు కూడా న్యాయం చేయలేదన్నారు. పులివెందుల్లో అత్యాచారానికి, హత్యకు గురైన నాగమ్మ కేసును మరుగున పడేసినట్లే సీతానగరం కేసును కూడా మరుగున పడేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇన్ని అరాచకాలు, దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ లో చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం ద్వారా నిందితులకు శిక్ష విధించినట్లు సిగ్గు లేకుండా హోమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీతానగరం యువతి కేసులో నిందితులను శిక్షించకపోతే మహిళా లోకమంతా కలసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆడబిడ్డలకు అన్నగా వుంటానని..కిరాతకుల పాలిట ఆపద్భాందవునిగా జగన్ నిలుస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.