మిత్రధర్మం అంటే ఇదేనా వీర్రాజుగారు?
posted on Apr 1, 2015 12:43PM
.jpg)
బీజేపీ నేత సోము వీర్రాజు నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాము మిత్రధర్మం పాటిస్తున్నప్పటికీ, తెదేపా నేతలు మాత్రం తమ పార్టీపై, మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. నేటికీ ప్రత్యేక హోదా పరిశీలనలోనే ఉంది. రైల్వే జోన్ ఇంకా మంజూరు కావలసి ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎన్నడూ పరుషంగా మాట్లాడలేదు. తన పార్టీ నేతలను, మంత్రులను కూడా మాట్లాడనీయలేదు.
కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించకపోయినప్పటికీ ఆయన తొందరపడి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కానీ తెదేపా ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయిందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆయనను విమర్శించడం మొదలుపెట్టి ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆయన తప్పనిసరిగా నోరువిప్పవలసి వచ్చింది. కానీ ఆ తరువాత మళ్ళీ తన పార్టీ నేతలెవరూ బీజేపీకి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేలా ఆయన చాలా కట్టడి చేసారు. ఆ విషయం బీజేపీ నేతలకి కూడా తెలుసు.
కేంద్రప్రభుత్వంతో తనకున్న అవసరాలవల్లనయితేనేమి లేదా మిత్రధర్మంవల్లనయితేనేమి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలని అదుపు చేస్తున్నారు. అయినప్పటికీ తెదేపా మిత్రధర్మం పాటించడం లేదని సోము వీర్రాజు ఆరోపించడం హాస్యాస్పదం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఇరువురూ కూడా తమ మిత్ర పక్షమయిన తెదేపా, దాని అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయ శత్రువయిన జగన్మోహన్ రెడ్డికి అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా, ఆయన చంద్రబాబు నాయుడుపై పిర్యాదులు చేస్తుంటే వారు చాలా ఆసక్తిగా వినడాన్ని ఏవిధంగా భావించాలి? మిత్రధర్మం అంటే ఇదేనా?