రాజధానికి వెళ్లేందుకు ప్రవేశపన్ను చెల్లించక తప్పదా?
posted on Mar 31, 2015 9:14PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణాలోకి ప్రవేశించే ఆంధ్రాకు చెందిన వాహనాలపై రేపటి నుండి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పన్ను వసూలు చేయబోతోంది. అందుకు ఒక జీ.ఓ. కూడా జారీ చేసింది. గతేడాది కూడా ఇదే విధమయిన జీ.ఓ. జారీ చేసినప్పుడు హైకోర్టు తీవ్రంగా మందలించడంతో ప్రభుత్వం దానిని వెనక్కు తీసుకోక తప్పలేదు. కానీ హైకోర్టు విధించిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుంది గనుక రేపటి నుండి ఆంధ్రా నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రకాల వాహానాలపై ప్రవేశపన్ను వసూలు చేసేందుకు తెలంగాణా రవాణాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సహజంగానే ఆ నిర్ణయాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సరుకు రవాణా మరియు ప్రైవేట్ బస్సుల యజమానులు తప్పు పడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య ముఖ్యంగా ఆంధ్రాలో వివిధ జిల్లాలనుండి హైదరాబాద్ కి రోజుకి దాదాపు 800 ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ట్రావల్స్ సంస్థలు ఈరోజు అర్ధరాత్రి నుండి ఆ బసులన్నిటినీ నిలిపివేయాలని నిర్ణయించుకొన్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు మరో పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నప్పుడు, తమ రాష్ట్ర రాజధానిలో ప్రవేశించడానికి తామెందుకు ప్రవేశపన్నుచెల్లించాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వాహన యజమానుల సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అందువలన కనీసం మరో ఐదేళ్ళపాటు తమకు ప్రవేశపన్ను నుండి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు.
కానీ రాష్ట్ర విభజన జరిగి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత కూడా ఇంకా ఇటువంటి వితండవాదనలు చేయడాన్ని తెలంగాణా ప్రభుత్వం తప్పు పడుతోంది. ఈ తొమ్మిది నెలలలో తమ ప్రభుత్వం భారీగా పన్ను నష్టపోయిందని, ఇంకా నష్టపోయెందుకు అంగీకరించబోమని తెలంగాణా ప్రభుత్వం తెగేసి చెపుతోంది. రేపటి నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని ఇతర రాష్ట్రాల వాహనాలపై పన్ను విదిస్తున్నట్లే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాహనాలపై కూడా పన్ను విధిస్తామని తెలంగాణా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కనుక నేడో రేపో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణాకు చెందిన వాహనాలపై ప్రవేశపన్ను విధించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యతో తమకు ఏమీ సంబంధం లేదని ఇరు రాష్ట్రాల ప్రజలు భావించవచ్చును. కానీ వాహనదారులు తమపై పడే ఈ అదనపు భారాన్ని ప్రజలకే బదలాయించడం తధ్యం. కనుక అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అటు తెలంగాణా ప్రభుత్వ వాదనలు, ఇటు వాహన యజమానుల వాదనలు రెండూ సమంజసంగానే ఉన్నాయి గనుక ఈ సమస్యను మళ్ళీ కోర్టులే పరిష్కరించవలసి ఉంటుందేమో?