పొత్తుల కంటే రహస్య పొత్తులే మేలయా

 

తెదేపా-బీజేపీలు దాదాపు రెండున్నర నెలల పాటు సీట్ల పంపకాలపై ఎడతెగని మంతనాలు చేసిన తరువాత రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొంటున్నాయని ప్రకటించాయి. ఇది జరిగి రెండు వారాలు కూడా కాలేదు. ఈరోజు పార్వతీపురంలో జరిగిన సభలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బీజేపీతో పొత్తుల గురించి పునరాలోచించుకోవలసిన అవసరం ఏర్పడిందని ప్రకటించడంతో ఈ మూన్నాళ్ళ ముచ్చట ముగుస్తుందని స్పష్టం చేసారు.

 

శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కానట్లు, పొత్తులు విచ్చినం చేసుకోవడానికి అవసరమయిన ఆ నాలుగు ముక్కలు కూడా ముచ్చటగా ఆయన పలికేశారు కూడా. “తాము నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దామనే ఉద్దేశ్యంతోనే బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే, ఆ పార్టీకి కేటాయించిన స్థానాలలో బలహీనమయిన అభ్యర్ధులను నిలబెట్టి, ప్రత్యర్ధ పార్టీలకు ప్రయోజనం కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. ఇరు పార్టీల ప్రయోజనలాకు భంగం కలిగిస్తున్న పొత్తులపై పునరాలోచించుకోవలసిన ఆగత్యం ఏర్పడిందని చెపుతూ, పద్దతి ప్రకారం తప్పుని బీజేపీ మీదకి నెట్టివేసే ప్రయత్నం చేసారు.

 

ఇదే విషయమై చర్చించడానికి డిల్లీ నుండి వచ్చిన బీజేపీ అగ్రనేత ప్రకాష్ జవదేకర్ కూడా అంతే ఇదిగా స్పందిస్తూ “చంద్రబాబు నాయుడు పార్వతీపురం సభలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి వచ్చాయి. మేము కూడా పొత్తులను సమీక్షిస్తున్నాము. అయితే ఇంకా పొత్తులు కొనసాగుతున్నాయి,” అని చెప్పడంతో ఈ మూన్నాళ ముచ్చట రేపటితోనే ముగిసే అవకాశాలున్నాయి.

 

రెండు నెలల క్రితం కేసీఆర్ తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని డిల్లీలో ఉండే సోనియాగాంధీ అనే దేవతతో గ్రూప్ ఫోటో దిగి హైదరాబాద్ తిరిగి వచ్చేసిన తరువాత, ఆమెను ఇప్పడు బలిదేవత అని ఏవిధంగా ఎద్దేవా చేస్తున్నారో, అదేవిధంగా రేపటి నుండి తెదేపా, బీజేపీ నేతలు కూడా ఒకరినొకరు ఎవరూ ఊహించలేని విధంగా తిట్లు తిట్టుకోవడం ప్రజలు చూడబోతున్నారు.

 

‘వారివి అనైతిక పొత్తులని తాము మొదటి నుండే చెపుతున్నామని, ఇప్పుడు అదే నిజమయిందని’ వారి ప్రత్యర్ధులు కూడా ఎద్దేవా చేయడం కూడా ఈ ఆటలో షరా మామూలే. ఇప్పటికే సాక్షి మీడియాలో ‘బీజేపీకి కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు’ అని కధనాలు అల్లేసి ప్రసారం మొదలు పెట్టేసింది.

 

“ పొత్తులు పెట్టుకొని కత్తులు దూసుకోవడం కంటే విడిపోయి, (స్నేహ పూర్వకంగా) కత్తులు దూసుకొంటే ప్రజలను కూడా నమ్మించడం తేలిక. తద్వారా ఓట్లు ఆ రెండు పార్టీల మధ్యనే చీల్చుకోగలిగితే, ఆనక ఎన్నికల తరువాత మద్దతుకి ఇబ్బంది కూడా ఉండదు,” అనే ఫార్ములాని తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చక్కగా అమలుచేసి చూపిస్తున్నాయి గనుక, బహుశః తెదేపా-బీజేపీలు కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోవచ్చును.