తెదేపా జిల్లా అధ్యక్ష పదవులకు కొనసాగుతున్న ఎన్నికలు

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఈరోజు (ఆదివారం) తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా మరియు చిత్తూరు జిల్లాల, తెలంగాణాలో నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది.

 

ఇంతకు ముందు గుంటూరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో గుంటూరు జిల్లా అధ్యక్షునిగా వినుకొండ శాసనసభ్యుడు ఆంజనేయులు, నెల్లూరుకి బీద రవిచంద్ర, అనంతపురం జిల్లాకి పార్ధసారధి మరియు పశ్చిమగోదావరి జిల్లాకి రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

 

రేపు కడప, కర్నూలు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.

 

అధ్యక్ష పదవులు చేప్పట్టిన వారు తమ తమ జిల్లాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసి ప్రజలకు పార్టీని, ప్రభుత్వాన్ని మరింత చేరువచేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నికవుతున్న వారందరికీ ఆరు నెలల సమయం ఇస్తానని ఒకవేళ వారి పనితీరు బాగోకపోతే వారిని తొలగించి వారి స్థానంలో మరో సమర్ధమయిన వ్యక్తిని నియమిస్తానని చంద్రబాబు నాయుడు అధ్యక్షులుగా ఎన్నికయిన వారికి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యనే తెదేపా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలకు ఇన్-చార్జ్ మంత్రులను కూడా నియమించింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవుతున్నవారు, జిల్లా ఇన్-చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొంటూ పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu