స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు అవమానం
posted on Aug 13, 2025 8:26PM

తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించారు. గవర్నర్‌ను దాటుకుని నేరుగా వైస్-ఛాన్సలర్ వద్దకు వెళ్లి ఆమె డిగ్రీని స్వీకరించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి నుంచి విద్యార్థులు ఒక్కొక్కరిగా పట్టాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన పరిశోధక విద్యార్థిని జీన్ జోసెఫ్ వంతు వచ్చింది. ఆమె వేదికపైకి వెళ్లి గవర్నర్‌ను పట్టించుకోకుండా దాటి వెళ్లిపోయారు.
నేరుగా వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా తన పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య పెండింగ్ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.