ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలు తీసుకోండి: హైకోర్టు
posted on Apr 11, 2020 4:20PM
కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై ఇటీవల విచారణ జరిపి ఉత్తర్వులిచ్చింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలంది.బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్’ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో వ్యర్థాల్ని నిర్వీర్యం చేయాలని స్పష్టం చేసింది.
బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లవద్ద ప్రజలు సామాజిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఒకవేళ నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టంచేసింది.