పోలీసులపై బీహార్ కార్మికులు రాళ్ల దాడి
posted on Sep 22, 2025 4:06PM

సూర్యాపేట జిల్లాలో పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఆగ్రహించిన కార్మికులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొందరు బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకూ, పలువురు కార్మికులకూ గాయాలు అయ్యాయి. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కార్మికులు రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.