ర‌ఘురామ సేఫ్‌.. సుప్రీం కీల‌క తీర్పు.. వేటు అంత వీజీ కాదు..!

సీఎం జ‌గ‌న్‌రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్న ఒకే ఒక్క‌డు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. ఆయ‌న పెడుతున్న టార్చ‌ర్ మామూలుగా లేదు. పార్టీలోనే ఉంటూ.. పార్టీ లైన్‌కు క‌ట్టుబ‌డే ఉంటూ.. ఎక్క‌డా చిక్క‌కుండా.. చిక్కుల్లో ప‌డ‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌గా జ‌గ‌న్‌రెడ్డికి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇంత‌కుముందు ర‌చ్చ‌బండ‌తో రోజూ జ‌గ‌న్ స‌ర్కారును బండ‌కేసి కొడుతూ ర‌చ్చ రంబోలా చేశారు. ఇప్పుడిక లేఖాస్త్రాల‌తో ముఖ్య‌మంత్రికి మ‌తిపోగొడుతున్నారు. త‌న‌ను ఇంత‌లా వేధిస్తున్న ర‌ఘురామ‌ను.. ఏసీబీ కేసుతో కుమ్మేయాల‌ని చూసినా.. కేర్‌ఫుల్‌గా త‌ప్పించుకొని.. ఢిల్లీలో మ‌కాం వేసి.. దేశ‌వ్యాప్తంగా జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌నిలో బిజిగా ఉన్నారు రాజు గారు. అందుకే, ఎలాగైనా.. ర‌ఘురామ‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని పంతం ప‌ట్టింది జ‌గ‌న్ పార్టీ. వైసీసీ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసి.. త‌మ వంతు ప్ర‌య‌త్నాలు జోరుగా చేస్తోంది. 

ఇప్ప‌టికే స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి ప‌లుమార్లు విజ్ఞ‌ప్తులు చేశారు. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ మొర‌బెట్టుకున్నారు. తాజాగా, ఎంపీ విజ‌య‌సాయి సైతం స్పీక‌ర్‌కు ఇదే విష‌యంపై లేఖ రాశారు. స్పీక‌ర్ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాలంటూ వైసీపీ ఎంత‌గా ఒత్తిడి చేస్తున్నా.. ఆయ‌న‌ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ర‌ఘురామ పార్టీ లైన్ దాట‌కుండా స‌ల‌హాలు, సూచ‌న‌ల రూపంలో అతిజాగ్ర‌త్త‌గా కుళ్ల‌బొడుస్తుండ‌టంతో టెక్నిక‌ల్‌గా ఆయ‌న్ను ఇరికించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. స్పీక‌ర్ నుంచి ఉలుకూప‌లుకూ లేక‌పోవ‌డంతో.. ఇక సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతోంది వైసీపీ. ఆ మేర‌కు ఇటీవ‌ల‌ న్యాయ నిపుణుల‌తో విజ‌య‌సాయిరెడ్డి  చ‌ర్చించినట్టు తెలుస్తోంది. 

అయితే, ఆదిలోనే హంస‌పాదు ఎదురైన‌ట్టు.. ర‌ఘురామ విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌నే ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే చెక్ ప‌డిన‌ట్టైంది. అన‌ర్హ‌త వేటు కేసుల్లో తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇర‌కాటంలో ప‌డేశాయి. అనర్హతలపై సుప్రీంకోర్టు నిస్సహాయత వ్య‌క్తం చేసింది. చట్టసభలకు ఎన్నికైన సభ్యుల అనర్హత కోసం దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో లోక్ సభతో పాటు చట్టసభల స్పీకర్ల పాత్రపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

అనర్హత వేటు కోసం కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న ఫిర్యాదులను స్పీకర్లు సకాలంలో పరిష్కరించకపోవడంపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై క్లారిటీ ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకునే విషయంలో మన దేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం మాత్రమే ఉంది. అది స్పీకర్లకే సర్వాధికారాలు కట్టబెట్టింది. దీంతో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. అనర్హతలపై నిర్ణయం తీసుకునే అధికారం చట్ట సభల స్పీకర్లకే ఉందంటూ వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్లు కాల పరిమితితో నిర్ణయం తీసుకునేలా చేయాలంటే పార్లమెంటే చట్టం చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

సో, సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య‌ల‌తో అన‌ర్హ‌త వేటుపై స్పీక‌ర్‌కే విచ‌క్ష‌ణ అధికారం ఉంటుందని స్ప‌ష్ట‌మైంది. అన‌ర్హ‌త వేటు నిర్ణ‌యంపై కాల ప‌రిమితి కానీ లేద‌ని తేలిపోయింది. ఈ లెక్క‌న‌.. వైసీపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా.. స్పీక‌ర్ ఇప్పుటికిప్పుడు అర్జెంటుగా వేటు వేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌. అటు, సుప్రీంకోర్టూ ఈ విష‌యంలో హ్యాండ్స‌ప్ అన్న‌ట్టే. సో, ఈ లెక్క‌న ఎంపీ ర‌ఘురామ‌పై అత్య‌వ‌స‌రంగా వేటు వేయించాల‌నే వైసీపీ కోరిక‌, ఆశ‌పై.. సుప్రీంకోర్టు నీళ్లు చ‌ల్లిన‌ట్టు అయింది. స్పీక‌ర్ ఆశీస్సులు ఉన్నంత వ‌ర‌కూ ర‌ఘురామ సేఫ్‌...
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu