జ‌గ‌న్‌ స‌ర్కారుకు కేంద్రం బిగ్ షాక్‌.. ఇప్పుడెలా..?

న‌వ‌ర‌త్నాల పేరుతో ఖ‌జానా ఖాళీ చేశారు. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేశారు. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డ‌మే చాలా క‌ష్టం అవుతోంది. చేసిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులే ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ ఖాతాలో పైసా కూడా లేదంటున్నారు. ఈ విష‌యం స్వ‌యంగా అధికారులే హైకోర్టుకు చెప్పారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. డ‌బ్బుల కోసం భూముల వేలానికీ సిద్ధ‌మ‌య్యారు. పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయం పెరుగుతుంది. అది వ‌దిలేసి.. ఓట్ల కోసం సంక్షేమ ప‌థ‌కాలతో ఊద‌ర‌గొడితే.. ఉన్న సొమ్ముంతా ఖ‌ర్చ‌యిపోతోంది. అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేసినా బాగుండేది.. ఎంతోకొంత ఏపీ ఇమేజ్ పెరిగి కంపెనీలు పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చేవి. సీఎం జ‌గ‌న్ అరాచ‌క విధానాల‌తో రాష్ట్రం దివాళా తీస్తోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆర్థిక క్లిష్ట ప‌రిస్థితుల్లో కేంద్రం రూపంలో మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. 

ఏం చేసినా.. ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏపీ స‌ర్కారుకు అప్పు ముట్ట‌డం లేదు. ఇప్ప‌టికే లిమిట్ దాటేయ‌డ‌మే.. కొత్త అప్పుల‌కు కేంద్ర స‌ర్కారు చెక్ పెట్టింది. తాజాగా, ఏ మేర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన తాఖీదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేయ‌డం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టే. రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. ఉన్న లిమిట్‌నూ త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

ఇష్టారీతిన చేసిన అప్పులే.. ఇప్పుడీ కొత‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఏపీ పంపిన వివ‌రాలు స‌మ‌గ్రంగా ప‌రిశీలించిన త‌ర్వాత.. రుణ పరిమితిలో భారీ కోత పెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ‌. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా ఇంతకుముందు సంవత్సరాల్లోనే అదనంగా రూ.17,923.94 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం గుర్తించింది. దీంతోపాటు ఇతరత్రా అప్పుల రూపంలోనూ రూ.6,000 కోట్లు మినహాయించింది. అన్నీ కలిపి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితికి రూ.23,924 కోట్ల కోత పడి... చివరకు రూ.27,668 కోట్లకు చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.27,668 కోట్లకే రుణాన్ని పరిమితం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితి రూ.37,163 కోట్లకు పరిమితమైంది. నికర రుణపరిమితి రూ.51,592 కోట్లకు చేరింది. 

అప్పుల‌నే న‌మ్ముకొని సంక్షేమ ప‌థ‌కాల‌తో ఊద‌ర‌గొడుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం విధించిన ఈ ష‌ర‌తు బిగ్ షాక్ అనే చెబుతున్నారు. అప్పు ప‌రిమితిలో కోత ప‌డ‌టంతో.. ఇప్పుడిక తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు. మ‌రి ఈ అప్పుల ఊబి నుంచి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu