సుప్రీం కోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు
posted on Sep 8, 2025 12:18PM
.webp)
తెలంగాణ బీజేపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి అప్పట్లో తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ ను రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దంటూ మందలించింది.