మూఢనమ్మకం.. ప్రాణాంతకం
posted on Aug 12, 2022 11:20AM
పూర్వం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి గోవులను, ఊరు జనాన్ని భయోత్పాతాన్నించి కాపాడాడని ప్రతీతి. దాన్ని గురించి కథలు కథలుగా ఇప్పటికీ చెప్పుకోవడం, భజన కీర్తనలు పాడుకోవడమూ అనాది గా ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ బులంద్‌షెహర్ లో దేవేంద్రి అనే మహిళకి పాము కరిస్తే ఆమె భర్త ఏకంగా పేడగుట్ట కింద పడుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బయటపడి బతుకుతుందని!
కొందరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిని ఎన్నాళ్లుపోయినా దాటి రాలేరు. అత్యాధునిక యుగంలో ఉన్నా మారుమూల గ్రామాల్లోనే కాదు బులంద్‌షెహర్ వంటి పట్టణాల్లోనూ ఇలాంటి మూఢ నమ్మకాల వారు ఉంటారు. నల్లపిల్లి దారికి అడ్డంగా వెళ్లడం మరింత దారుణంగా భావిస్తూనే ఉన్నారు. సైంటిస్టులు ఇలాం టి వేవీ నమ్మవద్దని చెబుతూనే ఉంటారు. వారిది కంఠశోషగానే మిగులుతోంది.
ఇంతకీ దేవేంద్రీ అనే ఆమె ఇంటికి పనులకు కావలసిన కలప తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. ఆమె కర్రముక్కలు ఏరుతున్న సమయంలో ఒక పాము కాటు వేసింది. ఆమె భయపడి ఇంటికి పరుగు తీసింది. భర్తకు జరిగినదంతా చెప్పింది. ఆమెను అతను వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లాలని చుట్టుపక్కలవారూ చెప్పారు. కానీ అతను అంత అవసరం లేదు, పాము కాటేకదా, పేడ ముద్దల వైద్యం చేస్తానన్నాడు. వారంతా ఆశ్చర్యపోయారు. కానీ అతను వినలేదు. వెంటనే ఇంటి ముందు ఆమెను పడుకోబెట్టి నువ్వేమీ ఖంగారుపడకు అంటూ ఆమె మీద పేడ ముద్దలు గుట్టగా కప్పాడు.
దేవేంద్రీ భర్త పిచ్చితనం చూసి పక్కింటాయన పాముల మంత్రగాడిని పిలిపించి మంత్ర చదివించాడు. ఆయన వచ్చి ఈ తతంగం అంతా అయ్యేసరికి చాలా ఆలస్యమే అయింది. చీమలు ఆమెను కుట్టేసేయి, పేడ పురుగులు పేడను మరింత కప్పేశాయి. భర్త గమనించుకోలేదు. మంత్రగాడి మంత్రాలు వ్యర్ధమ య్యాయి. దేవేంద్రీ ప్రాణం విడిచింది. ఆమె భర్తను ఆ ఊళ్లో చిన్నపిల్లాడి సైతం తిట్టిపోశాడు. ఇంత దారుణంగా ఎలా వ్యవహరించావు, పిచ్చినమ్మకాలకీ ఓ అంతుండాలని పక్కింటివాళ్లూ తిట్టారు.